ఫిలింసిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర
పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రామోజీ చితికి నిప్పంటించిన ఆయన కుమారుడు కిరణ్
రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఉదయం ఫిలింసిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్ నిప్పంటించారు.
ప్రముఖుల నివాళి
రామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం నుంచి ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని ఫిలింసిటీలోని నివాసంలో ఉంచారు.
ఆదివారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మురళీ మోహన్ తదితరులు రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రామోజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పాడె మోసిన చంద్రబాబు
ఆదివారం ఉదయం 9.30 గంటలకు రామోజీ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్తోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర స్మృతివనానికి చేరుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమ యాత్రలో పాల్గొని రామోజీ పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. 11.30 గంటల సమయంలో రామోజీ భౌతికకాయాన్ని చితిపై ఉంచారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత.. రామోజీ కుమారుడు కిరణ్ చితికి నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment