సాక్షి, హైదరాబాద్: దట్టంగా పెరిగిన ముళ్లచెట్టు.. దాని దిగువన మట్టిపుట్ట.. అందులో మహావీరుడితోపాటు మరో జైనవిగ్రహం. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రెండు విగ్రహాలు ఇలా మట్టిపుట్టలో వెలుగుచూశాయి. సిద్దిపేట శివారు పుల్లూరులో వీటిని గుర్తించారు. పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం వాటిని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో గిరన్న దిబ్బగా పిలుచుకుంటున్న ప్రాంతంలో వేములవాడ చాళుక్యుల కాలంలో జైన బసది ఉండేది.
కాలక్రమంలో అది ధ్వంసం అయింది. దేవాలయ శిథిల రాళ్లు తరలిపోగా మిగిలిన 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, మాతంగ యక్షుని శిల్పాలు పక్కనే పడిపోయి క్రమంగా మట్టిలో కూరుకుపోయాయి. కాలక్రమంలో వాటి చుట్టూ పుట్ట పెరిగిపోయింది. వాటి జాడ స్థానికుల ద్వారా తెలుసుకున్న కరుణాకర్, నసీరుద్దీన్ తదితరులు శివనాగిరెడ్డి దృష్టికి తేగా అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు.
10వ శతాబ్దికి చెందిన విగ్రహాలుగా గుర్తించారు. నల్ల శానపు రాతిపై చెక్కిన ఈ విగ్రహాల్లో.. మహావీరుడి భంగిమ పద్మాసనంలో ధ్యాన ముద్రతో ఉంది. ఇప్పటికీ అక్కడ ఆలయ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మిగిలిన ఈ విగ్రహాలు ఇంకా ధ్వంసం కాకుండా కాపాడాలని వారు గ్రామ స్తులను కోరారు. జైన ఆరాధకులు ముందుకొస్తే ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment