
ఎలుకలు కొరికిన రూ.500 నోట్లు
మహబూబాబాద్ రూరల్: అసలే నిరుపేద... ఆపై అనారోగ్యం.. ఆపరేషన్ నిమిత్తం రూ.రెండు లక్షలు అప్పు చేశాడు.. ఆ డబ్బుకు సంబంధించిన నోట్లను తన పూరి గుడిసెలో దాచుకోగా ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకులను ఆశ్రయించగా అవి చెల్లవని చెప్పారు. దీంతో ఎవరైనా ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది.
వివరాలు... మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు. తన కడుపులో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తెలిసినవారి వద్ద అప్పు చేశాడు. వాటితోపాటు కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment