రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్‌బీఐ | RBI Stops Printing Two Thousand Notes | Sakshi
Sakshi News home page

పెద్దనోట్లు’ తగ్గుతున్నాయ్‌!

Published Sun, Aug 9 2020 4:23 AM | Last Updated on Sun, Aug 9 2020 8:11 AM

RBI Stops Printing Two Thousand Notes - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఇకపై రూ. 2 వేల నోట్ల సంఖ్య మరింతగా తగ్గనుంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... పెద్దనోటు ముద్రణకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. నాలుగేళ్ల క్రితం రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్‌ చేసిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్‌ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.

నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు...
బ్లాక్‌మనీకి ముకుతాడు వేయాలని భావిస్తున్న కేంద్ర సర్కారు.. ఇప్పటికే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణను తగ్గించి రూ. 500 నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016–17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్‌ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా.. గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్‌ను కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ తక్కువ చేసింది. డిజిటల్‌ పేమేంట్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్‌బీఐ... వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది.

రూ. 200 నోటు ముద్రణకే ఎక్కువ ఖర్చు
కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రూ. 200 నోటు ప్రింటింగ్‌కు రూ. 2.15 చొప్పున వెచ్చించగా రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు చేసింది. అలాగే రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చుకాగా, రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది. అతితక్కువగా రూ. 10 నోటు ప్రింటింగ్‌కు 75 పైసలు ఖర్చు చేసినట్లు తెలిపింది. గతేడాది రూ. 2 వేల నోటు ముద్రించినందున..ఈ సమాచారాన్ని ఆర్బీఐ ముద్రణ సంస్థ వెల్లడించలేదు.

గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో)
సంవత్సరం    రూ. 500 నోటు    రూ. 2 వేల నోటు
2016–17        429.22        354.29
2017–18        578.10        11.15
2018–19        628.48        4.66
2019–20        822.77        –
==============================
మొత్తం        2,458.57    370.1 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement