అంజన్‌చారి (ఫైల్)
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చేవెళ్ల మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన వడ్ల అంజన్‌చారి (35) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతడు చేవెళ్లలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతినటంతో అంజన్‌చారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు అడుగుతుండటంతో కొన్నిరోజులుగా ఆందోళనలో ఉన్నాడు. ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజన్‌చారి తిరిగి రాలేదు.
ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అదే రోజు రాత్రి భార్య మమత దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తర్వాత శనివారం చేవెళ్ల మండల కేంద్రం నుంచి కందవాడ గ్రామానికి వెళ్లే దారి వైపున్న వెంచర్ వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. అంజన్‌చారిదే ఆ మృతదేహమని గుర్తించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో అంజన్‌చారి ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment