సాక్షి, హైదరాబాద్/ వెంగళరావు నగర్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అదేవిధంగా పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్‌కు లక్ష రూపాయలు, మినీ అంగన్‌వాడీ టీచర్ లేదా హెల్పర్‌కు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనుంది. పదవీ విరమణ పొందిన మరుసటి నెల నుంచి ఆసరా పెన్షన్ కూడా అమలు చేయనుంది. 50 సంవత్సరాలలోపు ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది.
సర్విసులో ఉన్న అంగన్‌వాడీ టీచర్ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్‌వాడీ టీచర్/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల నిమిత్తం అందజేయనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలికేరి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతినెలా 14లోపు వేతనాలు: మంత్రి సత్యవతి రాథోడ్
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీలోపు వేతనాలు అందిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అంగన్‌వాడీల సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలను అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగడం న్యాయసమ్మతం కాదన్నారు. ఆయా డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంగన్‌వాడీలతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment