ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
సాక్షి,హైదరాబాద్: నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలతో పాటు ప్రధాన నదులన్నీ ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల ఎగువ రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా ప్రవాహాలు పోటెత్తు తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండగా, ఆల్మట్టి, నారాయణ పూర్‌కు భారీగా వరద పెరిగింది. ఇక్కడకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవా హాలు పుంజుకున్నాయి. ప్రాణహిత మహో గ్రరూపం దాల్చుతోంది. (ఊళ్లన్నీ జలదిగ్బంధం)
ఎగువన మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పరీవాహకంలో కురుస్తున్న వానలు తోడవడంతో రికార్డు స్థాయి వరదతో పోటెత్తుతోంది. ప్రాణహిత నది మహోగ్ర రూపంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏకంగా నీటి ప్రవాహాలు 9.87 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రోజుకు సుమారు 90 టీఎంసీల మేర నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా, భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలు కానున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ తొణికిసలాడుతుండగా, చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
ఎస్సారెస్పీకి పెరిగిన వరద
గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. పరివాహకం నుంచి వస్తున్న నీటితో 46 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో నిల్వ 90 టీఎంసీలకుగాను 44.95 టీఎంసీలకు చేరింది. దీంతో పాటే లోయర్ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లికి ప్రవాహాలు పెరగడంతో అవి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయి మట్టాలకు చేరుకోనున్నాయి.
వరంగల్‌లో వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
నిండుకుండల్లా మధ్యతరహా ప్రాజెక్టులు
ప్రధాన నదులన్నీ ఉప్పొంగుతుండటంతో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిప డుతున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో తొణికిసలాడుతున్నాయి. మొత్తం ఈ 36 ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యం 62 టీఎంసీల మేర ఉండగా, 51.28 టీఎంసీల నిల్వలు చేరుకున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 1.39 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తు న్నారు. ఇదే జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం 40 వేల ప్రవాహం వస్తుండగా, మహబూబాబాద్‌లోని బయ్యారం ట్యాంక్‌కు 35,590 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాలోని వైరాకు 8,200, వరంగల్ రూరల్‌లోని పాకాల లేక్‌కు 8,402, ములుగు జిల్లాలోని పాలెంవాగుకు 12,452 క్యూసెక్కులు, రామప్ప లేక్‌కు 5,775, లక్నవరం లేక్‌కు 5,300 క్యూసెక్కుల మేర భారీ ప్రవాహాలు వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీమ్, వట్టివాగు ప్రాజెక్టులు సైతం ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండనున్నాయి. (అప్రమత్తంగా ఉండండి: డీజీపీ)
ప్రాణహిత మహోగ్రరూపం
ఎగువ ప్రవాహాలతో మేడిగడ్డ వద్ద ప్రాణహిత ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. మూడ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండగా, శనివారం 3.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, రెండ్రోజులుగా పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉదయానికి ఏకంగా 7.50 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి మరింత పెరిగి 9.87 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది దాదాపు 90 టీఎంసీలకు సమానం. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు 9.87 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో బ్యారేజీ 65 గేట్లెత్తి అంతే నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులను ఆపేయగా, అన్నారం బ్యారేజీకి సైతం మానేరు వాగు నుంచి ప్రవాహాలు పెరగడంతో అక్కడి పంప్‌హౌస్ మోటార్లను నిలిపివేశారు. ఈ బ్యారేజీకి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు 40 గేట్లెత్తి దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం అన్నారంలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 4 టీఎంసీల నిల్వ ఉంది. సుందిళ్ల బ్యారేజీలో 8.83 టీఎంసీలకు 6.42 టీఎంసీల నిల్వ ఉండగా, 6,208 క్యూసెక్కుల నీరు స్థానిక వాగుల నుంచి వస్తోంది. ఇక్కడి పంప్‌హౌస్ మోటార్లను నిలిపివేశారు. ఇప్పటివరకు జూన్‌లో మొదలైన సీజన్ నుంచి ఇంతవరకు మేడిగడ్డ నుంచి ఏకంగా 365 టీఎంసీల మేర నీరు దిగువకు వెళ్లిపోయిందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి.
11 సంవత్సరాల తర్వాత వనపర్తి జిల్లా సరళాసాగర్‌లోని సైఫన్ల ద్వారా దిగువకు వెళ్తున్న వరద
పోటెత్తుతున్న కృష్ణా
కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఇప్పటికే భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవటంతో స్థానిక పరీవాహకం నుంచి ఆల్మట్టిలోకి భారీ ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి 1.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 1.80లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఈ నీరంతా నారాయణపూర్ వస్తుండటంతో అక్కడి నుంచి 2.37 లక్షల క్యూసెక్కులు నదిలోకి వదిలేశారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. జూరాలకు ప్రస్తుతం 1.03 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, సోమవారానికి మరింత పెరగనుంది.
ప్రాజెక్టులో నీటి నిల్వ, ఎగువ ప్రవాహాల దృష్ట్యా 1.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలానికి ప్రస్తుతం 1.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీనికి తోడు ఎగువన ఉన్న తుంగభద్రలోకి 33,256 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ నీరంతా దిగువ శ్రీశైలానికి రానుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 215 టీఎంసీలకుగాను 144.80 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి 42 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా వదులుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్లో నిల్వ 312 టీఎంసీలకుగాను 250 టీఎంసీలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment