వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నమూనా
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌ను హెల్త్‌సిటీగా తీర్చిదిద్దే దిశలో రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేసింది. తాజాగా దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు ఇస్తూ శనివారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 15 ఎకరాల్లో భారీ భవన సముదాయాన్ని నిర్మించనుంది. 2 వేల పడకలు ఏర్పాటు చేయనుంది. స్పెషాలిటీ సేవల కోసం 1,200 పడకలు, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కోసం 800 పడకలను కేటాయించాలని నిర్ణయించారు. స్పెషాలిటీ వైద్యంలో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ మొదలైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సూపర్ స్పెషాలిటీల కేటగిరీలో ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర సేవలు ఇక్కడ లభించనున్నాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా డెంటల్ కళాశాలను ఈ ప్రాంగణంలోనే నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment