సరూర్‌నగర్ కార్పొరేటర్‌ను ఆశ్రయించిన తల్లిదండ్రులు
హుడాకాంప్లెక్స్:‘బిడ్డా.. ఎట్లున్నావ్.. ఎక్కడుంటున్నావ్.. భయపడొద్దు.. మీకేంకాదు’ అని ఉక్రెయిన్‌లో ఉంటున్న తమ బిడ్డలను తల్లిదండ్రులు గంటకోసారి వీడియో కాల్ చేస్తూ ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కునుకులే ని రాత్రులు గడుపుతున్నారు. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళన వారిని పట్టి పీడిస్తోంది. సరూర్‌నగర్ డివిజన్ మణిపురి కాలనీకి చెందిన దివ్య, మేఘన, అల్కాపురికి చెందిన తేజస్వి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
రెండు, మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.రోజురోజుకీ యుద్ధం తీవ్రత పెరుగుతుండటంతో అటు పిల్లలు,ఇటు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. గంటకోసారి వీడియో కాల్‌చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పిల్లలకు ధైర్యం చెబుతున్నారు. రెండు రోజులుగా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ పిల్లలు హాస్టల్‌లో కాకుండా మెట్రోస్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారని, ప్రాణా లను సైతం అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తినడానికి తిండి లేకుండా ఆందోళన చెందుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమ పిల్లలతో పాటు భారతీయ విద్యార్థులను కాపాడాలని స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
క్షేమంగా తీసుకురావాలి
యుద్ధం మొదలైనప్పటి నుంచి మాలో ఆందోళన మొదలైంది. బాంబుల శబ్దాలకు పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ ధైర్యం కోల్పోతున్నారు. మా పాపను ఏ విధంగానైనా సరే రప్పించాలి. నిన్న ఉన్న ధైర్యం ఈ రోజు లేదని వీడియోకాల్ చేస్తుంటే చూస్తున్నాం. ట్విట్టర్‌లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం.
– రాజుబాయి, మణిపురికాలనీ
ప్రభుత్వమే దిక్కు
వైద్య విద్యనభ్యసించడానికి రెండేళ్ల క్రితం నా బిడ్డ మేఘన ఉక్రెయిన్ దేశానికి వెళ్లింది. యుద్ధంతో తిండీ తిప్పలు లేక భరించలేకపోతోంది. ప్రభుత్వమే మా పిల్లలను రప్పించి మాకు అప్పగించాలి.
– నాగజ్యోతి
త్వరగా రప్పించాలి
కన్సల్టెన్సీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా పాపతో పాటు 29 మంది విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రప్పించాలి. ప్రభుత్వమే స్పందించాలి.
– వేణు
Comments
Please login to add a commentAdd a comment