సాక్షి, హైదరాబాద్: రైతుబీమాకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బీమా పరిధిలోని రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలకు (నామినీ) ఎల్‌ఐసీ సంస్థ పరిహారం కింద రూ. 5 లక్షల చొప్పున అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 40.07 లక్షల మంది రైతుబీమా కింద నమోదయ్యారు.
నాలుగేళ్లలో వారి పేర్లతో ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ. 4,367 కోట్లు ప్రీమియంకింద చెల్లించింది. ఈ కాలంలో 85,804 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా పరిహారంగా రూ.4,344 కోట్లు అందజేశారు. దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఆయా రైతు కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
90 శాతం సన్నచిన్నకారు రైతులే..
రైతుబీమా పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపున్న పట్టాదారులందరూ అర్హులే. ప్రతినెలా అర్హులైన వారి వివరాలను రెవెన్యూశాఖ నుంచి వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. పథకం ప్రారంభమైన మొదటి ఏడాది 2018–19లో 31.27 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ ఏడాది 17,666 మంది రైతులు మరణించగా, పరిహారం కింద వారి కుటుంబాలకు రూ.883 కోట్లు చెల్లించారు.
ఏటా పేర్లు నమోదు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం వరకు సన్నచిన్నకారు రైతులే ఉన్నారని వ్యవసాయశాఖ గతంలో అంచనా వేసింది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు 83 శాతం మంది ఉన్నారని లెక్కలు వేశారు. కాగా, ఈ నాలుగేళ్ల కాలంలో అత్యధింగా 2020–21లో 28,989 మంది రైతులు చనిపోయారు.
మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఆ ఒక్క ఏడాదే వేలాది మంది అధికంగా మరణించారు. కరోనా వీరవిహారం చేసిన సంవత్సరం కాబట్టి చాలామంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయ వర్గాలు విశ్లేషించాయి. ఆ రైతుల కుటుంబాలకు అత్యధికంగా రూ. 1,449 కోట్లు చెల్లించారు. కాగా, ఒక దశలో ప్రీమియం కంటే క్లెయిమ్స్ చెల్లింపులు అధికంగా ఉండటం గమనార్హం. ఇక 2022–23 ఏడాది బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి ఈ నెలలో చెల్లించనుంది. ఈ నేపథ్యంలో కొత్త వారిని బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment