సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకాలను దుబారా అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు భిక్ష అంటున్న కాంగ్రెస్ పార్టీకి, రైతులు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో బ్యాంకు అప్పుల వసూలుకు రైతుల ఇంటి తలుపులు తీసుకెళ్లిన ఘటనలు ఉండేవని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వెల్లడించారు.
కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పాలమూరు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతుల పొలాలకు అందిస్తున్న ఘనత బీఆర్‌ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి శిస్తురద్దు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ద్వారా రైతులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడం ద్వారా విత్తన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. నిందలు, వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను పట్టించుకోరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment