Rythu Bima
-
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!
కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం. ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. -
కోహ్లీలా కేసీఆర్ సెంచరీ!
సిరిసిల్ల: క్రికెట్లో విరాట్ కోహ్లీ లాగా రాష్ట్రంలో కేసీఆర్ సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఊరుకోడు.. మహారాష్ట్రలో అడుగు పెడతాడు, కర్ణాటకలో అడుగు పెడతాడు.. తర్వాత ఢిల్లీలో గులాబీ జెండా పాతాలని చూస్తాడని రాహుల్‌గాందీ, నరేంద్రమోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వాళ్లిద్దరికీ కొరకరాని కొయ్యలా అయ్యాడని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకొస్తే తమ కొంప మునుగుతుందని ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లుగా 24 గంటల కరెంట్ దేశమంతా ఇవ్వాలని, దేశమంతా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేయాలని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నాణ్యమైన విద్యనందించే గురుకులాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వివరించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ఎల్లారెడ్డిపేటల్లో జరిగిన యువ సమ్మేళనం సభల్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సినిమాకు అన్నీ కేసీఆరే తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీలకు లోకల్ లీడర్లు లేక.. కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్.. అన్నీ కేసీఆరేనని, మన సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ‘అదే ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్’అని అన్నారు. ఆ రెండు పారీ్టలు ఢిల్లీలో ఉస్కో అంటే.. ఇక్కడ డిస్కో అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. 11సార్లు చాన్సిస్తే ఏం చేశారు? ఢిల్లీ నాయకులు తెలంగాణ విషయంలో ఏనాడూ మర్యాదగా ప్రవర్తించలేదని మంత్రి అన్నారు. పోరాటాలు, త్యాగాలు, కేసీఆర్ ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్ పారీ్టకి 11 సార్లు అవకాశం ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఎందుకు ఇయ్యలేదని నిలదీశారు. ఆ పుర్రెలేని రాహుల్‌గాం«దీకి మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన పర్రె (పగులు) కూడా తెలియదని విమర్శించారు. తాము రాజకీయ హిందువులం కాదని, నిజమైన హిందువులమని స్పష్టం చేశారు. స్టెప్పులేసి జోష్ పెంచిన కేటీఆర్ ఎల్లారెడ్డిపేట యువ సమ్మేళనం వేదికపై కేటీఆర్ స్టెప్పులేశారు. ఎన్నికల పాట ‘దేఖ్లేంగే..’కు యువ నాయకులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు. సభికులు కేరింతలు కొడుతూ వారు కూడా స్టెప్పులేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. స్థానిక నాయకులను పేరుపేరునా పిలిచిన మంత్రి వారిలో జోష్ నింపారు. వేములవాడ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించే బాధ్యత నాది రాబోయే రోజుల్లో యువతతో మమేకమవుతామని, జాబ్ కేలండర్‌ను ప్రకటించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. జి ల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం, నియోజకవర్గానికో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తానని, స్వయం ఉపాధిని పెంచుతానని అన్నారు. తెలంగాణను దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దని, ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటుందో ఆలోచించాలని కోరారు. -
నాలుగేళ్లు.. రూ. 4,344 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబీమాకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బీమా పరిధిలోని రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలకు (నామినీ) ఎల్ఐసీ సంస్థ పరిహారం కింద రూ. 5 లక్షల చొప్పున అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 40.07 లక్షల మంది రైతుబీమా కింద నమోదయ్యారు. నాలుగేళ్లలో వారి పేర్లతో ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 4,367 కోట్లు ప్రీమియంకింద చెల్లించింది. ఈ కాలంలో 85,804 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా పరిహారంగా రూ.4,344 కోట్లు అందజేశారు. దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఆయా రైతు కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 90 శాతం సన్నచిన్నకారు రైతులే.. రైతుబీమా పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపున్న పట్టాదారులందరూ అర్హులే. ప్రతినెలా అర్హులైన వారి వివరాలను రెవెన్యూశాఖ నుంచి వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. పథకం ప్రారంభమైన మొదటి ఏడాది 2018–19లో 31.27 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ ఏడాది 17,666 మంది రైతులు మరణించగా, పరిహారం కింద వారి కుటుంబాలకు రూ.883 కోట్లు చెల్లించారు. ఏటా పేర్లు నమోదు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం వరకు సన్నచిన్నకారు రైతులే ఉన్నారని వ్యవసాయశాఖ గతంలో అంచనా వేసింది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు 83 శాతం మంది ఉన్నారని లెక్కలు వేశారు. కాగా, ఈ నాలుగేళ్ల కాలంలో అత్యధింగా 2020–21లో 28,989 మంది రైతులు చనిపోయారు. మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఆ ఒక్క ఏడాదే వేలాది మంది అధికంగా మరణించారు. కరోనా వీరవిహారం చేసిన సంవత్సరం కాబట్టి చాలామంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయ వర్గాలు విశ్లేషించాయి. ఆ రైతుల కుటుంబాలకు అత్యధికంగా రూ. 1,449 కోట్లు చెల్లించారు. కాగా, ఒక దశలో ప్రీమియం కంటే క్లెయిమ్స్ చెల్లింపులు అధికంగా ఉండటం గమనార్హం. ఇక 2022–23 ఏడాది బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ఈ నెలలో చెల్లించనుంది. ఈ నేపథ్యంలో కొత్త వారిని బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది. -
గుడ్‌న్యూస్! రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. (చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!)