సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీలను హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే.
గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్‌ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
శిశువుకు బర్త్ సర్టిఫికెట్
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్‌ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకోవాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్ ద్వారా బేబీ ఆఫ్ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ ఇప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment