సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల ఫలితాలను గురువారం ప్రకటించారు. ఇందులో బంగారు తెలంగాణ విభాగంలో సాక్షి దినపత్రిక సూర్యాపేట ఫొటో జర్నలిస్టు అనమల యాకయ్యకు ద్వితీయ బహుమతి, పల్లె, పట్టణ ప్రగతి విభాగంలో సాక్షి హైదరాబాద్ సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎన్.రాజేశ్‌రెడ్డి, ఇదే విభాగంలో సిద్దిపేట సాక్షి ఫొటో జర్నలిస్టు సతీశ్‌లకు కన్సోలేషన్ బహుమతి, అలాగే ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సాక్షి సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు బి.శివప్రసాద్‌కు తృతీయ బహుమతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఫొటో జర్నలిస్టు వి.భాస్కర్ ఆచారికి తృతీయ బహుమతి, ఇదే విభాగంలో సాక్షి యాదాద్రి ఫొటో జర్నలిస్టు కె.శివకుమార్‌కు కన్సోలేషన్ బహుమతి లభించింది.
సమాచార, పౌరసంబంధాల శాఖ వివిధ విభాగాల్లో పోటీలకు జూలై 9న ఎంట్రీలను ఆహ్వానించింది. దీనికి స్పందనగా 96 మంది మొత్తం 1,200 ఫొటోలను ఈ పోటీలకు పంపారు. జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.నాగరాజు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీష్ సభ్యులుగా ఉన్న కమిటీ విజేతలను ఎంపిక చేసింది.
మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి 10,000, కన్సోలేషన్ బహుమతికి రూ.5,000 నగదు అలాగే జ్ఞాపిక, సర్టిఫికెట్ అందచేస్తారు. ఈనెల 25న విజేతలకు బహుమతులను అందచేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment