సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం
2–3 రోజుల్లో సినీపరిశ్రమ పెద్దలతో వెళ్లి సీఎంను కలిసి మాట్లాడతా
ప్రముఖ నిర్మాత, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు వెల్లడి
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ
రాంగోపాల్‌పేట్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతిచెందడం దురదృష్టకరమని ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు అన్నారు. అయితే ఇలాంటి ఘటనలను ఎవరూ కావాలని చేయరని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం దిల్‌రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల్లేకుండా చూసుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎఫ్‌డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని ఆయన చెప్పారు.
రెండు, మూడు రోజుల్లో పరిశ్రమ పెద్దలతో సహా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని.. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. మరోసారి సీఎం కలవడంతోపాటు హీరో అల్లు అర్జున్‌ను కూ డా కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు.
రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..
శ్రీతేజ్‌కు వెంటిలేటర్ తొలగించి రెండు రోజులైందని.. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు దిల్‌రాజు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉండటం వల్ల తాను ఇక్కడికి రాలేకపోయానని.. సీఎంను మంగళవారమే కలిశానన్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యతను ప్రభుత్వం, సినీ పరిశ్రమ తీసుకుంటుందన్నారు. బాలుడి తండ్రి భాస్కర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని.. అవసరమైతే సినీ పరిశ్రమలో ఉద్యోగం కల్పిస్తామని దిల్‌రాజు తెలిపారు.
కళ్లు తెరిచిన శ్రీతేజ్
కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకుంటున్నట్లు వైద్యుల వెల్లడి
రాంగోపాల్‌పేట్: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కి సలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కోమాలో ఉన్న బాలుడిని వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. దీంతో అతను కాస్త కోలుకోవడంతో రెండు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు.
ప్రస్తుతం అతను సొంతంగానే శ్వాస తీసుకుంటుండటంతోపాటు కళ్లు తెరిచి చూస్తున్నాడని.. కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకోగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. అయితే ఇంకా కుటుంబ సభ్యులను గుర్తించట్లేదని.. మాటలకు ప్రతిస్పందించట్లేదని చెప్పారు. గత మూడు రోజులుగా నాసోగ్యా్రస్టిక్ ట్యూబ్ ద్వారా అందించే ఆహారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు.
థియేటర్ లోపల ఏమి జరిగిందో తెలియదు: భాస్కర్
సంధ్య థియేటర్ లోపల ఏమి జరిగిందో తనకు తెలియదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మీడియాకు చెప్పారు. తాను కుమార్తెతో కలిసి థియేటర్ బయట నుంచి భార్యకు ఫోన్ చేయగా లోపల ఉన్నట్లు చెప్పిందని.. ఆ కొద్దిసేపటికే తొక్కిసలాటలో మరణించినట్లు తెలిసిందన్నారు. ఇంతవరకు తాను ఆస్పత్రికి బిల్లులేవీ చెల్లించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
మైత్రీ మూవీస్ రూ. 50 లక్షలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయనకు చెందిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు, హీరో అల్లు అర్జున్ నుంచి రూ. 10 లక్షలు తనకు అందాయన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ తదితరులు నిత్యం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తనను సంప్రదిస్తున్నారని చెప్పారు.
అలాగే దర్శకుడు సుకుమార్ రెండుసార్లు వచ్చి కలిశారని తెలిపారు. ఘటన జరిగిన రెండవ రోజు అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడని సానుభూతితోనే నేను కేసు వాపసు తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment