సరికొత్త సాన్స్‌ మాస్క్‌! | Sans Mask with Special Cloth | Sakshi
Sakshi News home page

సరికొత్త సాన్స్‌ మాస్క్‌!

Published Wed, Aug 5 2020 5:49 AM | Last Updated on Wed, Aug 5 2020 5:49 AM

Sans Mask with Special Cloth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నిరోధానికి ప్రస్తుతం అందరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే మనం వాడే ఫేస్‌ మాస్కులు చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోగలిగితే.. వైరస్‌ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అచ్చం ఇదే ఆలోచనతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్న మాస్క్‌ను డిజైన్‌ చేశారు. సాన్స్‌ పేరు గల ఈ మాస్కు అత్యధిక నాణ్యతతో పాటు 2 కంటే ఎక్కువ పొరలు కలిగి ఉంటుంది. దీన్ని చౌక ధరకే తయారు చేయొచ్చు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్కులను పెద్దఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా తన ఫౌండేషన్‌ ద్వారా ముందుకొచ్చింది. ఈ మాస్కుల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ తెలిపారు. 

యాంటీ బ్యాక్టీరియా కూడా..: ఐఐసీటీ డిజైన్‌ చేసిన ఈ మాస్క్‌ బ్యాక్టీరియాను దరిచేరనివ్వని ప్రత్యేక వస్త్రంతో తయారుచేస్తారు. 3 నుంచి 4 పొరలుండే ఇది వైరస్‌ నుంచి 60 – 70 శాతం రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో తుంపర్లను 95 నుంచి 98 శాతం వరకు అడ్డుకుంటుంది. తుంపర్ల సైజు 0.3 మైక్రోమీటర్లున్నా సాన్స్‌ వాటిని లోపలికి రానీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి వైరస్‌ వ్యాప్తి దాదాపు అసాధ్యం. ఈ మాస్క్‌ను 2–3 నెలల వరకూ పదేపదే వాడొచ్చని, 30సార్లు ఉతికేంత వరకు దాని ప్రభావం అలాగే ఉంటుందని ఐఐసీటీ సీ నియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌. శ్రీధర్‌ తెలిపారు. సాన్స్‌ ద్వారా ఊపిరి తీసుకోవడం ఇతర మాస్కుల కంటే సులువుగా ఉంటుందన్నారు. సిప్లా లాంటి సం స్థ ఐఐసీటీతో చేతులు కలపడంపై సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ సి. మాండే హర్షం వ్యక్తం చేశారు. సాన్స్‌ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ నిరోధం మరింత సమర్థంగా జరుగుతుందని భావిస్తున్నట్లు ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement