గర్భిణులకు సీమంతం చేస్తున్న సర్పంచ్ రమేశ్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): గ్రామంలో ఎవరికైనా కూతురు పుడితే పాప పేరిట రూ.5,116 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ ప్రకటించారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లుగా భావించాలని చెప్పారు. తల్లి, చెల్లి, భార్య ఆడవాళ్లే అయినప్పుడు పుట్టే బిడ్డ మాత్రం ఆడబిడ్డ కావొద్దని కోరుకోవడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు.
పంచాయతీ రికార్డుల్లో జనన నమోదు చేసిన వెంటనే రమేశ్ అన్న కానుక పేరిట రూ.5,116 బ్యాంకులో డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను తల్లిదండ్రులకు అందిస్తామని తెలిపారు. దసరా పండుగ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు. తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ ఇందు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ తాజొద్దీన్ ఉన్నారు.
చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment