సాక్షి, హైదరాబాద్: మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ‘లక్ష’ణమైన పథకాన్ని ప్రకటించింది. స్వయం ఉపాధి పొందుతున్న, ఉపాధికి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ఒకింత ఊతమివ్వనుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నిబంధనలకు అనుగుణంగా అర్హతలను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఆ నిబంధనలే అమలు: ప్రభుత్వం గత నెలలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్దిదారుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కొన్ని నిబంధనలు విధించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్ధారించి లబ్దిదారులకు రూ.లక్ష చెక్కులు ఇస్తోంది. మైనార్టి లకు ఆర్థిక సాయం పథకానికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
- ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 2022–23 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ పథకం కింద పరిశీలిస్తారు. వీటినే 2023–24 ఆర్థిక సాయం కింద మార్పు చేసి అర్హతల మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టి స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయమందిస్తారు.
- క్రిస్టియన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హతలను నిర్ధారిస్తారు.
- ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 2023 జూన్ 2 నాటికి 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీస్థాయిలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో కలెక్టర్ జాబితాను ఖరారు చేస్తారు. అర్హుల జాబితాను టీఎస్‌ఎంఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
(బాక్స్) మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని మైనార్టి ల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు.
విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తూ మైనార్టి ల్లోని వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తోందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్షను ప్రభుత్వం అందిస్తోందని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment