పాఠశాలల వేళలు
ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ప్రత్యక్ష బోధన. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష బోధన.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు సోమవారం(నేడు) నుంచి తెరచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత ఏడాది మార్చి 16 నుంచి ప్రత్యక్ష విద్యా బోధనకు దూరమైన విద్యార్థుల్లో.. 9, ఆపై తరగతులకు చెందిన విద్యార్థులకు మళ్లీ తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, కోవిడ్ నిబంధనలతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
పాఠశాలల్లో 9, 10 తరగతులకు, ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు, డిగ్రీలో మూడు సంవత్సరాల వారికి, పీజీలో సెకండియర్ విద్యార్థులకు బోధన ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. వృత్తి సాంకేతిక విద్యా సంస్థల్లో మొదట నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం వారికి బోధన ప్రారంభిం చేందుకు, అదీ ల్యాబ్ తరగతులను మాత్రమే కొనసాగించేలా జేఎన్‌టీయూ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా మాస్క్ ధరించాల్సిందేనని, నో మాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
రెండు వారాలు చూసి...
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ప్రాథమిక పాఠశాలల టీచర్లు మినహా ప్రాథమికోన్నత, ఉన్నత తరగతులకు బోధించే టీచర్లంతా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలకు హాజరయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 50 శాతం టీచర్ల హాజరును అమలు చేసిన విద్యాశాఖ తాజాగా అందరూ హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది. రెండు వారాలు పరిస్థితిని గమనించి, పెద్దగా ఇబ్బందులు రాకపోతే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మార్చి ఒకటో తేదీ నుంచి మిగతా తరగతులను ప్రారంభించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.
శానిటైజేషన్ సమస్య తప్పదా?
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు విద్యార్థులు వచ్చాక శానిటైజేషన్ సమస్యలు తప్పేలా లేవు. రోజువారీ శానిటేషన్ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించినా వాటిని పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అవి ససేమిరా అంటున్నాయి. పాఠశాలలు, కాలేజీల ఆవరణలను మాత్రమే క్లీన్ చేయిస్తామంటున్న స్థానిక సంస్థలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టాయిలెట్లు ఇతరత్రా పరిసరాలను క్లీన్ చేయించేందుకు ఒప్పుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ గతంలో ఇచ్చి, లాక్‌డౌన్ సమయంలో తొలగించిన స్కావెంజర్లను ఇస్తేనే పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ సాధ్యం అవుతుందని ఓ సీనియర్ ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు.
గందరగోళంగా ఇంటర్ ప్రత్యక్ష బోధన
ఇంటర్మీడియట్‌లో ప్రత్యక్ష బోధన గందరగోళంగా మారింది. ఒకరోజు ప్రథమ సంవత్సరం వారికి, మరొక రోజు ద్వితీయ సంవత్సరం వారికి పాఠ్యాంశాల బోధన చేపట్టేలా ఏర్పాట్లు చేయడం లెక్చరర్లలో ఆందోళనకు కారణమైంది. ఈ లెక్కన ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి పరీక్షల సమయం వరకు వచ్చే 76 రోజుల పని దినాల్లో ప్రథమ సంవత్సరం వారికి 38 రోజులు, ద్వితీయ సంవత్సరం వారికి 38 రోజుల సమయమే ఉంటోంది. ఈ కొన్ని రోజుల్లోనే ద్వితీయ సంవత్సర విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేయడం కష్టమేనని లెక్చరర్లు అంటున్నారు. ఎక్కువమంది విద్యార్థులున్న చోట మాత్రమే షిఫ్ట్ విధానం అమలు చేయాలని, మిగతా కాలేజీల్లో డే బై డే విధానం కొనసాగించాలని పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరికీ షిప్ట్ విధానంలో బోధన చేపడితే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.
అయిన బోధనెంత.. విన్న వారెందరు?
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించిన ఆన్‌లైన్, డిజిటల్ (టీవీ) పాఠాల విషయంలో అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాలు ఎన్ని? వాటిని ఎంత మంది విద్యార్థులు విన్నారన్న విషయంలో ఉపాధ్యాయులకే స్పష్టత లేకుండా పోయింది. ఆన్‌లైన్ సమస్యలతో విద్యార్థులు అనేక మంది వాటికి దూరం అయ్యారని, ఇప్పుడు ఎక్కడి నుంచి బోధన ప్రారంభించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
డిగ్రీ, పీజీ విషయంలో కూడా..
డిగ్రీ, పీజీ తరగతుల విషయంలోనూ గందరగోళం నెలకొంది. మొదట షిప్ట్ విధానంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల అన్ని తరగతులను ప్రారంభిస్తామంటే ఉన్నత విద్యాశాఖ ఒప్పుకోలేదు. పోనీ తృతీయ సంవత్సర విద్యార్థులకే ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తామని చెప్పినా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయగా, ప్రతి తరగతిలో 50 శాతం మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా వారి పరిస్థితి ఏంటన్న గందరగోళం నెలకొంది.
ల్యాబ్ క్లాసులకే పరిమితం
వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ల్యాబ్ క్లాసులే నిర్వహించాలని, హాస్టళ్లలో గదికి ఒక్కరే ఉండాలని జేఎన్‌టీయూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ల్యాబ్ క్లాసులు నిర్వహించనున్నారు. 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ల్యాబ్ తరగతులు నిర్వహించాలని జేఎన్‌టీయూ పేర్కొంది. మొదటి 15 రోజులు కాలేజీకి వచ్చే విద్యార్థులు తర్వాత 15 రోజులు ఆన్‌లైన్‌లో థియరీ క్లాసులు వినేలా, తరువాత 15 రోజులు కాలేజీకి వచ్చేవారు ఇప్పుడు ఆన్‌లైన్‌లో క్లాసులు వినేలా ఏర్పాట్లు చేయాలని, మిగతా కోర్సులకూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
హాస్టల్ ఫీజుల పేరిట అడ్డగోలు వసూళ్లు
కాలేజీల హాస్టళ్ల విషయంలో ఒక్క జేఎన్‌టీయూ మినహా మిగతా వర్సిటీలేవీ స్పష్టత ఇవ్వలేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హాస్టల్ ఫీజుల పేరిట అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నాయి. మూడు నాలుగు నెలల కోసం ఒక్కో విద్యార్థి రూ.55 వేల నుంచి రూ.65 వేల వరకు చెల్లించాలని ఆదేశించాయి. ఇప్పుడు చెల్లిస్తేనే హాస్టల్ వసతి ఉంటుందని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment