సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో కంటోన్మెంట్ బోర్డులో కదలిక మొదలైంది. బోర్డు పరిధిలోని నివాసాల భద్రత చర్చనీయాంశమైంది. కంటోన్మెంట్ చట్టంలో ఫైర్ సేఫ్టీ పాటించాలని ప్రత్యేక నిబంధనలున్నాయి. అయితే దశాబ్దాలుగా ఏ ఒక్క నిర్మాణానికీ ఫైర్ ఎన్‌ఓసీ ఇచ్చిన దాఖలాల్లేవు. అలాగని జీహెచ్‌ఎంసీని ఆశ్రయిస్తే తమ పరిధి కాదంటూ వెనక్కి పంపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లో ఫైర్ సేఫ్టీపై బోర్డు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటు నివాసాల సంగతి అటుంచితే.. పక్కా వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్సు లేకుండానే ఓల్డ్ గ్రాంట్ (పురాతన) బంగళాల్లో కొనసాగుతున్న వ్యాపారాల కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఈఓ బి.అజిత్‌రెడ్డి ఆదేశాలతో బోర్డు అధికారులు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
15 మీటర్ల ఎత్తుకు లోబడే నిర్మాణాలు
► 10 వేల ఎకరాల విస్తీర్ణంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6,500 ఎకరాలకుపైగా స్థలం మిలటరీ అధీనంలోనే ఉంది. 2,800 ఎకరాల ప్రైవేటు స్థలంలోనే 400పైగా కాలనీలు, 50కిపైగా బస్తీలున్నాయి. మొత్తం భవనాల్లో కమర్షియల్ నిర్మాణాలు 5 శాతానికి మించిలేవు. ఫైర్ సేఫ్టీ నిబంధనల మేరకు 15 మీటర్లు.. అంతకంటే ఎత్తులో ఉండే భవనాలు, బహుళ అంతస్తులకు మాత్రమే ఎన్‌ఓసీ తీసుకోవాలి. కాగా, కంటోన్మెంట్‌లో 15 మీటర్లకు మించి నిర్మాణాలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో వెలిసిన నిర్మాణాలకు ఫైర్ ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. (చదవండి: మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్)
► అయితే ఆరు మీటర్లకంటే ఎత్తులో నిర్మించిన ఫంక్షన్ హాల్స్, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు ఎన్‌ఓసీలు తప్పనిసరి. అయితే, ఈ కేటగిరీలోకి వచ్చే అధికారిక భవనాలు కొన్నే ఉన్నాయి.
► బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు, వ్యాపారాలకు బోర్డు నుంచి అనుమతులతో పాటు ట్రేడ్‌లైసెన్సులు జారీ చేస్తారు.
ఓజీబీలే టార్గెట్..
► కంటోన్మెంట్‌లో బీ–3 కేటగిరీ స్థలాలుగా పరిగ ణించే ఓల్డ్ గ్రాంట్ బంగళా(ఓజీబీ)లు 117 ఉన్నాయి.
► బ్రిటిష్ జమానాలో అప్పటి మిలటరీ ఉన్నతాధికారులు, వ్యాపారులు, భూస్వాములకు నివాస అవసరాలకు వీటిని కేటాయించారు.
► స్థలం యాజమాన్య హక్కులు ఎప్పటికీ రక్షణ శాఖ అధీనంలో ఉండేలా, కేవలం భవనాలను మాత్రమే ఆయా వ్యక్తులకు అప్పగించారు.
► ఈ మేరకు హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్‌ఓఆర్) కింద బంగళాలను దక్కించుకున్న వ్యక్తులు నివాస అవసరాలకే వీటిని వాడాలి.
► బంగళా రూపురేఖల్లో మార్పులు చేయడం, నూతన నిర్మాణాలు చేపట్టడం, కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం.
► ఈ బంగళాలను ఇతరులకు విక్రయించరాదు. హెచ్‌ఓఆర్ కలిగిన వ్యక్తుల వారసుల పేరిట మార్చుకునే వెసులు బాటు కల్పించారు.
► ఓల్డ్ గ్రాంట్ బంగళాల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆయా బంగళాలను రక్షణ శాఖ ఎప్పుడైనా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.
► సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇలాంటి 117 బంగళాల్లో సగానికిపైగా భవనాలు మిలటరీ అధీనంలోనే ఉన్నాయి. కాగా, మిగిలిన వాటిలో పలు బంగళాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి.
► కంటోన్మెంట్ పరిధిలో 42 బంగళాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన బోర్డు అధికారులు 2007లో నోటీసులు జారీ చేశారు. ఐదేళ్ల క్రితం సుమారు 20 బంగళాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
► అయితే ఇప్పటికీ 40కి పైగా ఓల్డ్ గ్రాంట్ బంగళాల్లో 13 ఫంక్షన్ హాళ్లు సహా పూర్తిస్థాయిలో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ బోర్డు నుంచి ట్రేడ్ లైసెన్సు లేదు.
► బోర్డు అనుమతి, ట్రేడ్‌లైసెన్సు లేకుండా కొనసాగుతున్న వ్యాపారాలకు ఫైర్ ఎన్‌ఓసీలు తీసుకునే అవకాశమే లేదు.
► సికింద్రాబాద్ క్లబ్ కూడా ఈ తరహా బంగళా (బంగళా నంబర్ 220) కావడం విశేషం. క్లబ్‌లో ప్రమాదం నేపథ్యంలో మిగతా ఓల్డ్ గ్రాంట్ బంగళాలే టార్గెట్‌గా అధికారులు ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు)
Comments
Please login to add a commentAdd a comment