
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని హరిహరకళా భవన్.. జంట నగరాల ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకూ సుపరిచితమే.. 1989 సంవత్సరం నుంచీ అద్భుత కళా ప్రదర్శనలతో ఎప్పుడూ కళ కళలాడుతూ ఉండేది.. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో ఆ ప్రాంతం సందడిగా ఉండేది.. కేవలం కళలు, కళాకారులకే కాకుండా సభలు, సమావేశాలకూ వేదికయ్యేది.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో జిగేల్‌మంటూ మెరిసిపోయేది. ప్రదర్శనలు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చేవారు. ఉన్నట్టుండి కోవిడ్–19 కారణంగా హరిహరకళాభవన్ మూగబోయింది. 16 నెలలుగా భవన్ తలుపులు తెరుచుకోవడం లేదు. – రాంగోపాల్‌పేట్
కోవిడ్–19 కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నట్లే కళా రంగం కూడా తీవ్రంగా కష్టాల్లోకి కూరుకుపోయింది. నిత్యం ప్రదర్శనలతో సాగిపోతున్న హరిహరకళా భవన్‌కు తాళం పడింది. 1989 సంవత్సరం నుంచి ఎన్నో వేల కార్యక్రమాలకు వేధికైన హరిహరకళాభవన్ కోవిడ్–19 కారణంగా గతేడాది మూతపడింది. నగరంలోని రవీంద్రభారతి తర్వాత అతిపెద్ద ఆడిటోరియం ప్రస్తుతం కళా ప్రదర్శనలు లేక కళా విహీనంగా తయారైంది. నిత్యం అతిథులు, ప్రముఖుల రాకపోకలు, ప్రేక్షకులతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ భవన్ నిశ్శబ్దంగా మారి బోసిపోయింది.
16 నెలలుగా తెరుచుకోని తలుపులు
2020లో మొదటి దశ కరోనాతో మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో హరిహర కళాభవన్ కూడా మూత పడింది. తర్వాత షాపులు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని తెరుచుకున్నా కళాభవన్ మాత్రం తెరుచుకోలేదు. రెండవ దశ కరోనా వచ్చి లాక్‌డౌన్ ఎత్తేసినా ఆ అదృష్టం కళా భవన్‌కు దక్కడం లేదు. భవన్‌లో నెలకు సగటున 20 రోజులు కార్యక్రమాలు నడుస్తుండటంతో వాటి నుంచి జీహెచ్‌ఎంసీకి ఆదాయం చేకూరేది.
నామమాత్రపు అద్దెకు..
ఇంత పెద్ద ఆడిటోరియం నామమాత్రపు అద్దెకు అందిస్తుండటంతో చాలామంది ఇక్కడ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తుండేవారు. 16 నెలల నుంచి మూత పడిఉండటంతో ఆదాయానికి గండి పడింది. భవన్ నిర్వహణకు ఇక్కడ 16 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి జీతాలు విద్యుత్, నీటి బిల్లులు మాత్రం జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. ఒక్క రూపాయి ఆదాయం లేకున్నా విద్యుత్, తాగునీటితో పాటు నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
1400 సీట్ల కెపాసిటీతో..
1989 సంవత్సరం సెప్టెంబర్ 24న అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, గవర్నర్ కుముద్‌బెన్ జోషి, నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా దీన్ని ప్రారంభించారు. నగరంలోనే అతిపెద్ద ఆడిటోరియంగా 1400 సీట్ల కెపాసిటీతో ఎయిర్ కూలర్, పార్కింగ్ సదుపాయంతో దీన్ని నిర్మించారు.
ఎదురుచూస్తున్నాం
ప్రియ కల్చరల్ ద్వారా హరిహర కళాభవన్‌లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. మ్యాజిక్ షో, నృత్య ప్రదర్శనలు అందించాం. దక్షిణ భారత దేశంలోని అనేక నగరాల్లో ప్రదర్శనలు చేస్తున్నా తక్కువ అద్దెతో ఇంత పెద్ద ఆడిటోరియం ఎక్కడా కనిపించ లేదు. హరిహరకళాభవన్ తెరిస్తే మేము ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధం.
– కార్తీక్, ప్రియ కల్చరల్ కార్యదర్శి
ఏడాదిన్నరగా..
సికింద్రాబాద్ వాసులకు ఉండే మంచి ఆడిటోరియం. తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగుతుండేవి. ఎంతో మంది ప్రేక్షకులకు ఇవి ఆహ్లాదకరంగా ఉండేవి. కానీ ఏడాదిన్నరగా అందుబాటులో లేదు.
– సూర్యప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment