రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో గురువారం.. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు లుంగీ కట్టీ మెడలో తువాలు వేసి చెలరేగి పోయారు. కుర్తా పైజామాతో 'బల్లే బల్లే' అంటూ తమదైన శైలిలో చిందులేస్తూ అదరగొట్టారు. కేరళ, ఒరిస్సా, తెలుగు, పంజాబీ, గుజరాతీ సంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు.
ఇక్కడి లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల పట్టభద్రుల దినోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. విభిన్న వేషధారణలతో అందరిని అబ్బురపరిచారు. చిన్నారుల ఆటా పాటలు చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అలాగే యూకేజీ చిన్నారులు పట్టాను తీసుకుని ఆనందంతో గెంతులేశారు. విద్యా సంస్థల చైర్మన్ సదానంద్ విద్యార్థులకు పట్టాలు అందించారు.