లైంగిక దాడికి యత్నం.. వేదనతో బాలిక మృతి | Sexual Assault Attempt Girl Dies In Agony In Suryapet district | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి యత్నం.. వేదనతో బాలిక మృతి

Published Tue, Nov 15 2022 3:24 AM | Last Updated on Tue, Nov 15 2022 10:17 AM

Sexual Assault Attempt Girl Dies In Agony In Suryapet district - Sakshi

నిందితుడు  ఆమనగంటి రాజు 

తిరుమలగిరి (తుంగతుర్తి): ఓ కామాంధుడి లైంగికదాడి ప్రయత్నంతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురైన బాధిత బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం నాడే బాలిక మరణించడం స్థానికంగా మరింత విషాదం నింపింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన ఓ వితంతువు తన 14 ఏళ్ల కూతురితో కలిసి తిరుమలగిరిలోని పుట్టింట్లో నివసిస్తోంది.

ఆ మహిళ ఫణిగిరిలోని ఓ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తూ కూతురిని స్థానికంగా మరో పాఠశాలలో 9వ తరగతి చదివిస్తోంది. దసరా రోజున ఎదురింట్లో ఉండే చాకలి యాదమ్మకు భోజనం పెట్టిరమ్మంటూ ఆ మహిళ తన కూతురిని పంపించింది. అయితే ఆ సమయంలో ఇంట్లో మద్యం సేవించి ఒంటరిగా ఉన్న ఆమనగంటి రాజు... బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఎంతసేపటికీ కూతురు తిరిగి రాకపోవడంతో ఆ మహిళ.. యాదమ్మ ఇంటికి వెళ్లగా రాజు బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు.

కోమాలోకి వెళ్లి..
లైంగికదాడి ప్రయత్నంతో షాక్‌కు గురైన బాలిక అనారోగ్యం పాలైంది. కొన్ని రోజులపాటు జ్వరంతో బాధపడిన బాలికను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పట్నుంచి చిన్నారి ముభావంగా ఉండేది. రాత్రి సమయాల్లో ఆందోళనకు గురయ్యేది.

మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఎడమ చేయి, ఎడమకాలు వంకర్లు తిరగడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే 10 రోజుల క్రితం బాలిక కోమాలోకి వెళ్లి సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

కామాంధుడిని ఉరి తీయాలి..
ఇంటి ఎదురుగా ఉన్న రాజును మా బిడ్డఎప్పుడూ బాబాయ్‌ అంటూ పిలిచేది. దసరా రోజున అన్నం పెట్టడానికి వాళ్లింటికి వెళ్లింది. ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు. అతనికి ఉరి శిక్ష విధించాలి.    
– కుటుంబ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement