మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్‌ నిజాలు.. కారణం అదేనా? | Shocking Facts On The Mancherial District Fire Accident | Sakshi
Sakshi News home page

మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్‌ నిజాలు.. కారణం అదేనా?

Published Sun, Dec 18 2022 1:28 AM | Last Updated on Sun, Dec 18 2022 10:38 AM

Shocking Facts On The Mancherial District Fire Accident - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  శుక్రవారం అర్ధరాత్రి.. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. ఇంట్లో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.. కొద్దిసేపట్లోనే ఇల్లంతా వ్యాపించాయి. పొగ, ఊపిరాడని పరిస్థితి.. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెంకటాపూర్‌ ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. పెంకుటింట్లో నిద్రిస్తున్న మాసు శివయ్య (47), ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్‌ పద్మ (42), సింగరేణి కారి్మకుడు శనిగరపు శాంతయ్య అలియాస్‌ సత్తయ్య (54), నెమలికొండ మౌనిక (30), ఆమె కుమార్తెలు ప్రశాంతి (3), హిమబిందు (13నెలలు) మంటల్లో కాలిపోయారు. వీరంతా దళితులు కావడం, ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టినట్టుగా ఆధారాలు ఉండటంతో కలకలం రేగింది. వివాహేతర/సహజీవన సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

అర్ధరాత్రి నిద్ర లేపిన పొగ 
శుక్రవారం అర్ధరాత్రి దట్టమైన పొగ, కాలిన వాసన రావడంతో మాసు శివయ్య ఇంటి పక్కనే ఉన్న పొన్నాల ముకుందం లేచి బయటికి వచ్చాడు. అప్పటికే శివయ్య ఇల్లు కాలిపోతోంది. వెంటనే తన భార్యాపిల్లలను నిద్రలేపి బయటికి తీసుకెళ్లాడు. వాళ్లు బిగ్గరగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని నిద్రలేపారు. వెంటనే అంతా కలిసి బిందెలు, బకెట్లతో నీటిని చల్లుతూ.. బాధిత కుటుంబీకులు, బంధువులు, పోలీసు, అగి్నమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి 1.26 గంటలకు బెల్లంపల్లి అగి్నమాపక కేంద్రానికి సమాచారం చేరింది. రాత్రి 2 గంటల సమయంలో ఫైరింజన్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పారు. సిమెంటు ఇటుకలతో నిర్మించిన గోడలతో పైన కలప దుంగల ఆధారంగా కట్టిన పెంకుటిల్లు అది. మంటలకు దుంగలు కాలిపోయి.. పైకప్పు కూలిపోయింది. ఇంట్లో మొత్తం మూడు గదులు ఉండగా.. ఒక గదిలో ముగ్గురి, మధ్యలో గదిలో ఒకరి, మూడో గదిలో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఇంట్లో ఉన్న ఇనుప బీరువా, గ్యాస్‌ సిలిండర్, వంట సామగ్రి, వ్రస్తాలు అన్నీ పూర్తిగా దహనమైపోయాయి. 

పెట్రోల్‌ క్యాన్లు.. కారంపొడి 
దళిత కుటుంబం సజీవ దహనం విషయం తెలియడంతో.. డీసీపీ అఖిల్‌ మహాజన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, మందమర్రి, బెల్లంపల్లి టౌన్‌ సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారు. ఫోరెన్సిక్, క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా.. ఇంటి వెనుకాల ఉన్న రోడ్డు నుంచి జైపూర్‌ మండలం రసూల్‌పల్లి వైపు పరుగెత్తింది. అయితే ఆటోలో కారంపోడి, ఇంటి వెనకాల చెట్టు కింద రెండు పెట్రోల్‌ క్యాన్లు కనిపించడంతో.. ఎవరో ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శివయ్య కుమారుడు సందీప్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తిచేశారు. ఐదుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. శుక్రవారం సాయంత్రం గ్రామశివార్లలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శాంతయ్య మృతదేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కాగా.. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పరామర్శించి ఓదార్చారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

చుట్టపు చూపుగా వచ్చి ప్రాణాలు పోయి.. 
మాసు శివయ్య, రాజ్యలక్ష్మి భార్యాభర్తలుకాగా.. శాంతయ్య సింగరేణి ఆర్కే5 గనిలో కారి్మకుడు. అతను కొంతకాలం నుంచి శివయ్య కుటుంబంతోనే నివసిస్తున్నట్టు బంధువులు చెప్తున్నారు. ఇక రాజ్యలక్ష్మి అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు పిల్లలు చుట్టపు చూపుగా మూడు రోజుల క్రితం వచ్చారు. మౌనిక భర్త రెండేళ్ల కిందే చనిపోయాడు. కోటపల్లి మండలం కొండంపేటలోని తల్లిగారింట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ ఘటనలో ఆమె, పిల్లలు కూడా బలయ్యారు. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు బత్తుల లింగయ్య, కమల కూడా వెంకటాపూర్‌లోని ఇంటికి వచ్చారు. అయితే లింగయ్యకు మద్యం, పొగాకు అలవాటు ఉండటంతో.. ఆ వాసన పడదని, తెలిసినవారి ఇంట్లో నిద్రపోవాలని రాజ్యలక్ష్మి చెప్పింది. వారు వేరేవాళ్ల ఇంట్లో నిద్రపోవడంతో దుర్ఘటన నుంచి బయటపడ్డారు. 

వచ్చే సరికే దారుణం జరిగిపోయింది 
ఇల్లు ఎలా కాలిపోయిందో తెలియడం లేదని.. నస్పూర్‌లో ఉండే తనకు రాత్రి ఒంటి గంటకు ఫోన్‌ చేస్తే వెంకటాపూర్‌కు వచ్చానని శివయ్య కుమారుడు సందీప్‌ కన్నీళ్లు పెట్టాడు. ‘‘మాకు రాత్రి ఒంటి గంట సమయంలో ఇల్లు కాలిపోతోందని తెలిసింది. వెంటనే పరిగెత్తుకు వచ్చాం. నీళ్లు పోస్తూ మంటలు ఆర్పాం. కానీ అందరినీ కోల్పోయాం.’’ అని శివయ్య పెద్ద కుమార్తె భర్త నారమల్ల శ్రీనివాస్‌ వాపోయాడు. 
 
మేం వచ్చే సరికి ఇల్లు కూలిపోయింది 
ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇంటి పైకప్పు కూలిపోయి ఉంది. 
– కె.రవీందర్, బెల్లంపల్లి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (17ఎంసీఎల్‌321) 

లేచి చూసే సరికే భారీగా మంటలు 
మా ఇంట్లోకి పొగలు, వాసన రావడంతో నిద్రలేచి చూశాను. అప్పటికే శివయ్య ఇల్లు మంటల్లో కాలిపోతోంది. చుట్టుపక్కల వారిని నిద్రలేపి.. అంతా కలిసి నీళ్లు చల్లడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే లోపల ఉన్నవారు కాలిపోయి ఉంటారు. 
– పొన్నాల ముకుందం, ప్రత్యక్ష సాక్షి (17ఎంసీఎల్‌322) 

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం 
ఇల్లు దహనమై ఆరుగురు మృతిచెందడంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సాంకేతిక, వైద్య, ఫోరెన్సిక్‌తో ఆధారాలు సేకరిస్తున్నాం. ప్రమాదమా? కుట్ర కోణమేమైనా ఉందా? అనేది విచారణ చేస్తున్నాం. 
– అఖిల్‌ మహాజన్, డీసీపీ, మంచిర్యాల (17ఎంసీఎల్‌324).

వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం వెనుక వివాహేతర సంబంధమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్‌ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్‌ నస్పూర్‌లో ఉంటున్నాడు.

ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్‌ కూడా జరిగింది. 

డబ్బు రేపిన చిచ్చుతో.. 
శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్షి్మతో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శాంతయ్యను, శివయ్య కుటుంబాన్ని అంతం చేయాలని కొందరు బంధువులతో కలిసి ప్లాన్‌ చేసినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ బంకు నుంచి పెట్రోల్‌ తీసుకొచ్చి ఇంటిపై చల్లి నిప్పుపెట్టారని.. ఈ మేరకు పెట్రోల్‌ తీసుకొస్తున్నవారి సీసీ కెమెరా పుటేజీ దొరికిందని తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ వివరాలను ధ్రువీకరించలేదు. ఆధారాలు సేకరించాక వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement