పెద్దపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.. అమ్మా ఇంటికి వస్తున్నా.. వంట చేయమన్నావు కదరా.. అంటూ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన కొట్టె పురుషోత్తం–భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కుమారస్వామి, రమేశ్, ప్రభాకర్(42)లు ఉన్నారు.
కుమారస్వామి 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పురుషోత్తం తాను చేస్తున్న సింగరేణి ఉద్యోగాన్ని చిన్న కుమారుడు ప్రభాకర్‌కు పెట్టించాడు. దీంతో అతను సీసీ శ్రీరాంపూర్ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తున్నాడు. రామగుండం ఎన్టీసీపీ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడికి భార్య కవిత ఉంది. సంఘటన స్థలాన్ని ఎస్సై జీవన్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిననట్లు పేర్కొన్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని రాత్రి కూనారం తీసుకురాగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్ యాదవ్, సర్పంచ్ డొంకెన విజయ, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లూరి రమాదేవి, ఏఎంసీ చైర్‌పర్సన్ కొట్టె సుజాత, సింగిల్‌విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, నాయకులు కొట్టె సమ్మయ్య, గ్రామస్తులు నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment