
సాక్షి, హైదరాబాద్: అధిక ఉత్పత్తి, సమీకృత మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్, సహకార స్ఫూర్తి అమలుకాకపోవడంతో సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చారని చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగోరోజు పుణె సమీపంలోని బారామతి సోమేశ్వర రైతు సహకార చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను ఆద్యుడిగా రైతులు భావిస్తారని మంత్రి పేర్కొన్నారు.
మహారాష్ట్ర సహకార రంగంలో రైతుల పాత్ర అద్వితీయమని కొనియాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కర్మాగారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 27 వేల మంది రైతులు సమష్టిగా చెరుకు పండించి వారే తమ సహకార పరిశ్రమలో చక్కెర, ఇథనాల్, కరెంటు తయారు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుండడంపై శరద్ పవార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తను, తన పార్టీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment