![Sitakka: Telangana Strive for national festival status for Sammakka Saralamma Jatara - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/12/SETHAKKA.jpg.webp?itok=n7fmWGQt)
సమీక్షలో మంత్రి సీతక్క తదితరులు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు.
జాతీయ పండుగ హోదాతో రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నిధులకు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మక్క–సారక్క జాతర ఏర్పాట్లపై సోమవారం డీఎస్‌ఎస్ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలో జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సూచించారు. జాతర ఏర్పాట్లపై వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పల్లె ప్రజలకు మరింత చేరువ కావాలి
పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడేవనీ, వాటిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువయ్యేలాగా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ టి.ఎస్.ఐ.ఆర్.డి.లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శాఖ పని తీరును సమీక్షించారు.
పీఆర్ ఆర్‌డీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఆయా విభాగాల వారీగా చేపడతున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment