
గతంలో ఉత్తరాఖండ్ సొరంగంలోపల చిక్కుకున్న 41 మందిని రక్షించిన ఘనత వీరి సొంతం
హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు.. నేడు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు..
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ(SLBC Tunnel) సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners)ను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సిల్క్ యారా సొరంగం కుప్పకూలి లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులను.. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరికోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ప్రత్యేకంగా రప్పించింది.
నసీం, ఖలీల్ ఖురేషీ, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ ఖురేషీ, మహమ్మద్ ఇర్షాద్.. ఈ ఆరుగురితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సోమవారం ఉదయం వారు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకుని, లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేపట్టనున్నారు.
కేవలం ఒక్కరోజులో బయటికి తెచ్చి..: 2023 నవంబర్ 13న సిల్కియారా సొరంగం ముఖ ద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకున్నారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలో దింపింది. వారు కేవలం ఒక్క రోజులోనే కారి్మకులను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్న బృందమే ఉత్తరాఖండ్ ఆపరేషన్‌లో పాల్గొనడం గమనార్హం.
ఏమిటీ ర్యాట్ హోల్ మైనింగ్?
మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారే సహాయక చర్యలకు దిక్కుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment