సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఇటు సరుకు రవాణా రైళ్లు, అటు ప్రయాణికుల రైళ్ల ద్వారా కలిపి మొత్తం రూ.18,973 కోట్ల రాబడి సాధించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.15,708 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. 2021–22లో 14,266.04 కోట్లు మాత్రమే సాధించింది. ఈసారి పాత రికార్డులను బద్దలు కొడుతూ ఏకంగా రూ.19 వేల కోట్లకు చేరువ కావటం విశేషం.
దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లకు గాను దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఉత్తర రైల్వే, తర్వాత వరసగా మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వేలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సరుకు రవాణాతో రూ.13,051.10 కోట్లు, ప్రయాణికుల రైళ్ల ద్వారా రూ.5,140.70 కోట్లు ఆర్జించిందని తెలిపారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 25.56 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారని, అంతకుముందు సంవత్సరంలో ఆ సంఖ్య కేవలం 12.70 కోట్లేనని పేర్కొన్నారు.
ఆగస్టు నాటికి సిద్దిపేటకు రైలు
మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో సిద్దిపేట వరకు పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే ఆగస్టు నాటికి రైలును సిద్దిపేట వరకు నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు రైలు పట్టాలు దాటేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్లను వినియోగించుకోవాలని, నేరుగా పట్టాలు దాటొద్దని కోరారు. 139 హెల్ప్‌లైన్ నంబరును వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు జీఎం ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment