సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల వేళలను సవరించారు. కొంత కాలంగా రైళ్ల వేగాన్ని పెంచుతూ వస్తున్న అధికారులు ఇటీవల ముఖ్యమైన రైళ్లను గరిష్ట వేగంతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ప్రయాణ సమయం తగ్గింది. మరోపక్క కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తుండటంతో ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. ఈ రెండు కారణాలతో తాజాగా వాటి వేళలను సవరించారు. సాధారణంగా అవసరాన్ని బట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్‌లో సమయాలను సవరించటం పరిపాటి. ఇప్పుడు రెండు ప్రత్యేక కారణాలతో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సమయాలను అందుబాటులోకి తేనున్నారు.
జోన్ పరిధిలో ప్రస్తుతానికి 71 రైళ్ల వేళలను సవరిస్తూ కొత్త టైంటేబుల్‌ను విడుదల చేశారు. 10 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల మేర వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అన్ని స్టేషన్లలో కూడా రైళ్ల వేళల మార్పులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి రాకేశ్ విజ్ఞప్తి చేశారు.
చదవండి: Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
Comments
Please login to add a commentAdd a comment