అంచనా కంటే రెండు రోజుల ముందే తెలంగాణలోకి ప్రవేశం
వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. చల్లబడ్డ వాతావరణం.. తగ్గిన ఉష్ణోగ్రతలు
రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వానలకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ ఈ నెల 5 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కానీ వాతావరణ పరిస్థితులు కలసిరావడంతో సోమవారమే నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు వచ్చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 4,5 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.
గత ఏడాది కరువు ఛాయలతో..
గతేడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 22న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆ తర్వా త కూడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. వర్షాల మధ్య తీవ్ర అంతరంతో చాలా ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపించాయి. పంటల సాగు, దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు 2022 వానాకాలంలో రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించాయి. ఆ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 48శాతం అధికంగా నమోదయ్యాయి.
రెండు రోజుల పాటు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం కూడా కొనసాగింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. చాలాచోట్ల సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment