అర్ధరాత్రి దాటినా అంతులేని వినోదం..
నిలోఫర్ చాయ్ మొదలు ఓల్డ్ సిటీ బిర్యానీ వరకు
ఐతే ట్యాంక్ బండ్.. లేదంటే ఎయిర్‌పోర్ట్ రోడ్
లండన్‌ను తలపించే మాదాపూర్, గచ్చిబౌలి
ఐటీ రోడ్లపై చిల్లింగ్ రైడ్స్.. కేబుల్ బ్రిడ్జి పై సెల్ఫీ స్పాట్స్..
కాక్‌టేల్ మిక్స్ నైట్ హైదారాబాద్ పై ప్రత్యేక కథనం...
నగరం నిద్రపోవడం మర్చిపోయి చాన్నాళ్లైంది.. అయ్యో.. ఇదేదో స్లీప్ డిజార్డరో, మానసిక రుగ్మతో కాదు. ఇదో అధునాతన జీవనశైలి. నగర యువత డార్క్ ఫాంటసీకి అలవాటుపడుతోంది.. అర్ధరాత్రుళ్లయినా హైదరాబాద్ రోడ్లు అలసిపోవు, ఆఫీసులు ముగిసినా ఆహ్లాదానికి విసుగు రాదు. నగరానికున్న ఎన్నో విశిష్టతల్లో సిటీ నైట్ లైఫ్ ఒకటి. అది కూడా ఎదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. నగరానికి నలుమూలలా ఫేవరెట్ స్పాట్లున్నాయి. సెంట్రల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొదలు లండన్‌ను తలపించే మాదాపూర్ స్ట్రీట్స్ వరకూ నైట్ లైఫ్ ఒక అనుభూతి, ఒక ఎమోషన్. ఆ అర్ధరాత్రి రంగుల హరివిల్లుపై ఓ లుక్కేద్దామా..?!!
ఒకప్పుడు రాత్రి తొమ్మిది దాటిందంటే ఎదో టీవీ షో చూస్తూనో, డిన్నర్ చేస్తూనో లేదా ఆ పాటికే నిద్రపోవడమో జరిగేది. కానీ.. ప్రస్తుతం పగలు ఓ రోజు, రాత్రి మరో రోజు అనేలా మారింది. అలా అందరికీ కాకపోయినప్పటికీ సగానికి పైగా యువతకు ఇప్పుడిదే ట్రెండ్ అయ్యింది. అర్ధరాత్రి వరకూ ఆహ్లాదం కోసం సిటీ రైడ్ వేయడం సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు నగరంలోని పలు చోట్ల అర్ధరాత్రి వరకూ ఇరానీ ఛాయ్ నుంచి హైదరాబాద్ బిర్యానీ వరకూ అందుబాటులో ఉండటం ఓ కారణం. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగుల షిఫ్టింగ్ విధానంతో ఈ నైట్ కల్చర్ మరింత పెరిగింది. అలా అని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చి»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ సందడి ఉందనుకుంటే పొరపాటే. ఓల్డ్‌సిటీ మొదలు ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ రోడ్ వరకూ ఈ నిశాచర జీవితం అంతులేని ఆహ్లాదానికి, యువత సంతోషాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
వినోదం కోసం విహారం..
మాదాపూర్ టూ హైటెక్‌సిటీ రోడ్. రాత్రి 10, 11 గంటలు దాటినా ఇక్కడి టిఫిన్ల కోసం 10 నిమిషాలైనా ఆగాల్సిందే. అంత మంది అక్కడికి చేరుకుంటారు. రాత్రి 12 గంటలైనా ట్యాంక్ బండ్ రోడ్ జాతరలా ఉంటుంది. ఇప్పుడిది కేక్ కటింగ్ స్పాట్‌గా మారింది. ఈ మధ్య కాలంలో సంబంధిత అధికారులు ఇక్కడ కేక్ కటింగ్ నిషేదించినా బర్త్‌డే పార్టీల సందడి అంతగా తగ్గనే లేదు. ఇక నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమ్యాక్స్, ఈట్ స్ట్రీట్ రోడ్‌లో పాత ఆనవాయితే. అయితే కొత్తగా సెక్రటేరియేట్, భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నైట్‌సెల్ఫీ స్పాట్‌గా మారింది.
నైట్ ఈటింగ్..
నగరంలోని ఛాయ్ ప్రేమికుల కోసం వీధి వీధినా చాయ్ స్టాల్స్ ఉన్న నంగతి తెలిసిందే. కానీ రాత్రి సమయంలో చాయ్ తాగాలంటే ఐతే నీలోఫర్‌లో తాగాలి.. లేదా చార్మినార్ నిమ్రా కేఫ్‌లో తాగాల్సిందే, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాల్సిందే. ముజాంజాహి మార్కెట్ వేదికగా రాత్రి వెన్నెలలో చల్లని ఐస్‌క్రీం తినడం మరో స్పెషల్. ఇక ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్ ‘బిర్యానీ’ అంటే షాదాబ్ నుంచి ప్యారడైస్ వరకూ.., మేఫిల్ నుంచి కేఫ్ బాహర్ వరకూ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది.
కాక్‌టేల్‌కు మించిన కిక్..
క్లబ్‌లు, పబ్బులు, బార్‌లు, రెస్టారెంట్లు.. ఒకటా రెండా.. నగరంలో విహరించాలంటే ఎన్నో కారణాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఈ మధ్య కాలంలో ఐతే దుర్గం చెరువు పై రంగురంగుల లైట్లతో నైట్ రెయిన్ బోను తలపించే కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగడమో, రీల్స్ చేయడమో ఒక ట్రెండ్‌గా మారింది. ఎంతలా అంటే.. కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ పెరగిపోయి అవస్థలు పడేంతలా. అందుకే సీసీ టీవీ కెమెరాలతో కట్టడి చేస్తున్నారు. రాత్రిళ్లు మాదాపూర్, గచ్చి»ౌలి మధ్య బైక్ రైడ్ చేయడం ఈ తరం యూత్‌కు ఒక సరదా. అంతేకాదు.. ఏకంగా శంషాబాద్‌లోని ఎయిర్ పోర్ట్‌కు ఓ రైడ్ వేసి అక్కడే పిజ్జానో, బర్గరో తిని.. మర్చిపోకుండా మళ్లీ ఓ సెల్ఫీ దిగడం కూడా స్పెషల్ అచీవ్‌మెంట్. కొండాపూర్ నుంచి ఎల్‌బీ నగర్ వరకూ.. బొల్లారం నుంచి ఆరాంఘర్ వరకూ అర్ధరాత్రిళ్లు అనుమతులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్, ఐస్‌క్రీం పార్లర్లలో సందడి చేయడం నగరవాసులకొక హాబీలా మారింది. అయితే ఈ సంస్కృతి ఆరోగ్యానికి హానికరం ఐనప్పటికీ.. మిక్స్‌డ్ కాక్‌టేల్‌కు మించిన కిక్ ఇస్తుందనేది నైట్ లైఫ్ లవర్స్ అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment