ప్రతీకాత్మక చిత్రం
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మామిడికి మంచి రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత ఉండటం తో వీటికి ఉత్తర భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, జమ్ము, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఇప్ప టివరకు లారీల్లో మామిడిని తరలించిన వ్యాపారులు, ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సోమవారం కిసాన్ రైలు జగిత్యాల–లింగంపేట రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకోనుంది. మామిడికాయలు వ్యాగన్లలో లోడ్ కాగానే రాత్రి 11 గంట లకు రైలు ఢిల్లీ బయలుదేరుతుంది.
సీజన్ ముగిసే వరకు..
మామిడి సీజన్ ముగిసే వరకు జగిత్యాల నుంచి ఢిల్లీకి కిసాన్‌రైలును నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం సోమవారం 20 వ్యాగన్లలో 460 టన్నుల మామిడికాయలను తరలించనున్నారు. 14న, 19న మళ్లీ కిసాన్ రైలు మామిడి కాయలతో జగిత్యాల నుంచి ఢిల్లీ వెళ్లనుంది. ఇలా సీజన్ ముగిసే వరకు నడిపనున్నారు. ఈ రైలును ఉపయోగించుకుంటే 50% సబ్సిడీ ఇస్తారు. కాగా, కిసాన్‌రైలు ద్వారా రైతులకు, వ్యాపారులకు మేలు జరుగుతుందని రైల్వే అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుభమ్‌జైన్ అన్నారు. ఎంతవరకు అవసరమైతే ఆ మేరకు కిసాన్ రైళ్లను నడిపిస్తామని చెప్పారు.
జగిత్యాలలో కొనుగోలు చేసిన మామిడికాయలను ఎక్కువగా ఢిల్లీ పంపిస్తాం. అయితే, డీజిల్ ధర పెరగడంతో రవాణా భారం ఎక్కువైంది. ఈ సమయంలో కిసాన్‌రైలును ఉపయోగించుకుంటున్నాం. దీని ద్వారా రవాణా ఖర్చు తక్కువ అవడమేకాక ఒక్క రోజులోనే ఢిల్లీకి చేరుతుంది. దీని ఫలితంగా రైతులకు సైతం కొంత రేటు పెరిగే అవకాశం ఉంటుంది. – సాధిక్, మామిడి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment