టెక్స్‌టైల్‌ పార్కుల పనుల్లో వేగం పెంచండి | Speed up textile parks works | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్‌ పార్కుల పనుల్లో వేగం పెంచండి

Published Sat, Apr 29 2023 3:06 AM | Last Updated on Sat, Apr 29 2023 11:56 AM

Speed up textile parks works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, ఆదాయ, వృత్తి నైపుణ్యం పెంచేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. బీఆర్‌కే భవన్‌లో ఆయన జౌళి శాఖపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్‌ టైల్‌ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అత్యంత సులభంగా నేతన్నలకు అందేలా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ టెక్స్‌టైల్‌ పార్కులు, ఆప్పారెల్‌ పార్కుల అభివృద్ధిని చేపట్టిందన్నారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్‌ పార్క్, గద్వాల్‌ హ్యాండ్లూమ్‌ పార్క్‌ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులుంటే వెంటనే వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్ల పనితీరుపైన, వాటి పురోగతి పైన వెంటనే నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. 

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి 
చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  

పవర్‌లూమ్‌పై కూడా... 
రాష్ట్రంలో ఉపాధి కోసం నేతన్నలు విస్తృతంగా ఆధారపడిన పవర్‌లూమ్‌ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం దేశంలోనే ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్‌ క్లస్టర్‌ మాదిరి ఒక సమీకృత పద్ధతిన,అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్‌ లూమ్‌ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.ఇందుకోసం తిర్పూర్‌లో పర్యటించి అనేక అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో చేనేత, పవర్‌ లూమ్‌ కార్పొరేషన్ల చైర్మన్లు ఎల్‌.రమణ, గూడూరి ప్రవీణ్, టెక్స్‌ టైల్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement