రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం | Speker Pocharam Srinivas Reddy Review On Telangana Assembly Session | Sakshi
Sakshi News home page

Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు

Published Thu, Sep 23 2021 3:17 PM | Last Updated on Thu, Sep 23 2021 9:16 PM

Speker Pocharam Srinivas Reddy Review On Telangana Assembly Session - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  సమావేశాల ఏర్పాట్లపై గురువారం ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభలోని కమిటీ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసన సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి,  శాసనమండలి ప్రోటెం చైర్మన్  వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారని గుర్తుచేశారు.

రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ, 8వ సెషన్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాల మాదిరే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ఆయా శాఖల తరఫున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్‌లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలని తెలిపారు.

సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఆదేశించారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే మన శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు.

సమావేశానికి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ &యూడీ) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీ (ఎస్పీఎఫ్‌) ఉమేశ్‌ షరాఫ్, హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్, డీజీ (లా & ఆర్డర్) జితేందర్, అడిషనల్ సీపీ (క్రైం) షీకా గోయల్, జాయింట్ సీపీ (సెంట్రల్ జోన్)  విశ్వ ప్రసాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సీపీ (రాచకొండ) సుధీర్, డీఐజీ (ఇంటలిజెన్స్) శివకుమార్, ఇన్‌చార్జి డీఐజీ (ఐఎస్‌డబ్ల్యూ) తప్సిన్ ఇక్బాల్, డీసీపీ (ట్రాఫిక్) భాస్కర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్ తదితరులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement