కొత్త క్రీడా ముసాయిదాపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
స్కిల్స్ వర్సిటీ తరహాలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు నిర్ణయం
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా విధానం రూపకల్పనకు సూచన
హైదరాబాద్‌లోని అన్ని క్రీడా మైదానాలను స్పోర్ట్స్ హబ్‌లోకి తేవాలని నిర్దేశం
క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ తదితర 14 క్రీడా కోర్సుల నిర్వహణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొత్త క్రీడా పాలసీని 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధి కారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చే విధంగా క్రీడా విధానం ఉండాలని సూచించారు. అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయా లన్నారు. గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ యూని వర్సిటీని ప్రారంభించాలని చెప్పారు.
దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో కొత్త క్రీడా విధానంపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, జితేందర్‌రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సీఎంవో అధికారులు శేషాద్రి, షాన వాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరి స్తున్న విధానాలపై సమావేశంలో చర్చించారు.క్రీడల్లో రాణించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటు లోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.
చైర్మన్‌ను నియమించాలి...
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో ఏర్పాటు చేసినట్లుగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సి టీగా తీర్చిదిద్దాలని సూచించారు.
క్రీడా విశ్వవిద్యాలయానికి చైర్మన్‌ను నియమించాలని.. వర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని ఆదేశించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రాథమికంగా 14 కోర్సులను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో పొందుపరిచారు.
ప్రముఖ క్రీడా మైదానాలన్నీ ఒకే గొడుకు కిందకు..
ప్రముఖ క్రీడా మైదానాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడి యం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటి వాటన్నింటినీ గుర్తించి ఒకే గొడుగు కిందకు తేవాలని చెప్పారు.
చదువుకు ఆటంకం లేకుండా..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించి వారి చదువులకు ఆటంకం లేకుండా జాతీయ, అంతర్జా తీయ స్థాయి పోటీలకు అవసరమైన శిక్షణ అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. భౌగోళిక అనుకూల పరిస్థితుల తోపాటు తెలంగాణ ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేశ, విదేశాల కోచ్‌లను రప్పించాలని, అక్కడున్న వర్సిటీల సహకారం తీసుకొనేలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు.
ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానం..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడా కారులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో స్పష్టమైన విధా నాన్ని అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి? ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే విషయంలో మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలించి పలు మార్పుచేర్పులను సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment