ఖైరతాబాద్ మహాగణపతికి 70 వసంతాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద గణపతి ఉత్సవ మూర్తి
ఇంటిపేరు ‘ఖైరతాబాద్ శిల్పంగా’ చిన్నస్వామి రాజేంద్రన్
18 ఏళ్ల వయసులోనే 14 అడుగుల ఎత్తు విగ్రహ రూపకర్త
ఇంతింతై వటుడింతయై.. అన్నట్లు.. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు.. అన్నట్లు.. 70 ఏళ్ల ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం కొనసాగుతోంది.. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం నిరి్వగ్నంగా 70 వసంతాలకు చేరుకుంది. యేటా ఒక్కో అడుగు పెంచుకుంటూ 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకున్నాడు.
యేటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమివ్వనున్నారు. ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. ఇంతటి అద్భుత రూపాలతో యేటా మహాగణపతిని రూపొందిస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అంతఃకరణ శుద్ధితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి ఆయన పంచుకున్న పలు విశేషాలు..
ప్రపంచవ్యాప్త గుర్తింపు...
మహాశక్తి గణపతి వరల్డ్ రికార్డు నెలకొల్పనుంది. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు వాడ వాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు సింగరి శంకరయ్య ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన ఒక్క అడుగు విగ్రహం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగానే కాక, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి గణనాథుని వేడుకోవడం విశేషం.
సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో..
రిజర్వ్‌బ్యాంక్ ఉద్యోగి ఏసుపాదం 1978లో నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో 14 అడుగుల ఎత్తులో వినాయకుడిని తయారు చేయాలని కోరారు. అదే మొట్టమొదటి సారిగా ఆరు బయట స్టేజీపై 14 అడుగుల ఎత్తులో విష్ణు అవతారంలో చేసిన విగ్రహం. అది అందర్నీ ఆకట్టుకోవడంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాననే సంతోషం దక్కింది. 1980లో పంచముఖ వినాయకుడిని సారథి స్టూడియోలో చేసి ఖైరతాబాద్ తీసుకొచ్చాం. 1982లో ఎలుక రథంతో మంటపంలో చక్రాల బండిపై స్టాండ్‌తో తయారుచేశాం. అదే సంవత్సరం సాగర సంగమం సినిమా షూటింగ్‌లో భాగంగా నటుడు కమల్ హాసన్‌తో పాట చిత్రీకరణ జరిగింది. 1993 నుంచి 1999 వరకూ ఏడు సంవత్సరాల పాటు ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరించలేదు. ఆ ఏడు సంవత్సరాలు ఆరి్టస్టు రంగారావు నేతృత్వంలో మహాగణపతిని తయారుచేశారు. మరలా 2000 నుంచి ఇప్పటి వరకూ నిరి్వరామంగా మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
లడ్డూ ప్రసాదం నైవేద్యంగా..
తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ మహాగణపతికి 2010లో 500 కిలోల లడ్డూను ప్రసాదంగా చేతిలో ఉంచి భక్తులకు పంచిపెట్టారు. ఆ తరువాత వరుసగా 2400, 3600, 4200 లడ్డూను నైవేద్యంగా ఇచ్చారు. 2015లో 6000 వేల కిలోల లడ్డూ మహాగణపతి చేతిలో 11 రోజులు పూజలందుకోవడం మొట్ట మొదటిసారి ఖైరతాబాద్ మహా
గణపతికే సొంతం.
ఆ రూపాలు సంతోషాన్నిచ్చాయి..
ఎలుక రథంపై 1982లో చేసిన వినాయకుడి రూపం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ తరువాత విశ్వరూప, మత్స్య వినాయకుడు, ఈ యేడాది 70 అడుగుల ఎత్తులో చేసిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాలు నాకు ప్రత్యేకం. 2024 ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో మట్టితో మహాగణపతిని చేయడం వెనుక ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దివంగత సింగరి సుదర్శన్ భక్తులకు ఇచి్చన మాటను నిలబెట్టేందుకు ఈ విగ్రహాన్ని చేశాను. ఎత్తులో ఇదే చివరి విగ్రహం.. వచ్చే యేడాది నుంచి విగ్రహం ఎత్తు తగ్గుతూ వస్తుంది..
నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ..
ఖైరతాబాద్ వినాయకుడు, మా నాన్న గారి ఆశీర్వాదంతో నేను ఉన్నన్ని రోజులూ ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని ఏమాత్రం తగ్గకుండా పెంచేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్తా. 70 సంవత్సరాలు 70 అడుగులు చేయాలన్న మా నాన్న సింగరి సుదర్శన్ ఆఖరి కోరికను తీరుస్తూ ఆ దిశగా అడుగులు వేయటం సంతోషంగా ఉంది.
– సింగరి రాజ్‌కుమార్
70 అడుగుల మట్టి వినాయకుడు..
ఈ యేడాది 70 అడుగుల మట్టి వినాయకుడే వరల్డ్ రికార్డు. ఉత్సవ కమిటీ కనీ్వనర్‌గా, ఎన్నో దశాబ్దాలుగా మహాగణపతి సేవలతో వెన్ను దన్నుగా వ్యవహరిస్తున్నా. వైజగ్‌లో గతంలో 80 అడుగుల వినాయకుడిని చేసినా అక్కడే నిమజ్జనం చేశారు. ఈ సంవత్సరం విజయవాడలో 72 అడుగులు వినాయకుడిని చేశారు. కానీ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ 70 అడుగుల మహాగణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం గావిస్తాం. ఇది వరల్డ్ రికార్డు.
– సందీప్ రాజ్, ఉత్సవ కమిటీ కనీ్వనర్
పుట్టింది అక్కడే..
తమిళనాడు, పరంబలూరు జిల్లా, పుదువేటకుడి గ్రామానికి చెందిన చిన్నస్వామి, మరుదాయి దంపతులకు 8 మంది సంతానం కాగా, వీరిలో రెండో సంతానం చిన్నస్వామి రాజేంద్రన్. పేదరికంలో ఉన్నా కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చెన్నైకి వచ్చి అక్కడ వేలుస్వామి వద్ద పనిచేయడం ప్రారంభించా. అప్పట్లో హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ నటించే పౌరాణిక ఘట్టాలకు సంబంధించిన ఆభరణాలకు స్టోన్స్ అతికించే పనికోసం నా సీనియర్స్‌తో పాటు నన్ను హైదరాబాద్ పంపారు. ఆ సమయంలో నేను చేసిన పనిని గుర్తించి నన్ను ఆరి్టస్టుగా ప్రోత్సహించారు.
ఆ గుర్తింపే ఇంటిపేరుగా..
ఎప్పుడైతే ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తూ వచ్చానో ఆ తరువాత నన్ను మహా గణపతి ఆర్టిస్టుగా గుర్తించడం ప్రారంభిచారు. ఇక అదే నాకు ట్రేడ్ మార్క్, ఇంటి పేరులా మారిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతిని తయారుచేసే భాగ్యం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
– చిన్నస్వామి రాజేంద్రన్, ఖైరతాబాద్ మహాగణపతి శిల్పి.
Comments
Please login to add a commentAdd a comment