సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలలకు గాను చెల్లించాల్సిన వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2021 ఏప్రిల్, మే నెలల వేతన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంది. కానీ, వచ్చే నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపులకుగాను నిధుల సర్దుబాటు కష్టం కావ డంతో ఈ చెల్లింపులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో విడు దల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ రెండు నెలల వేతన బకాయిలను 2022, ఏప్రిల్ వేతనంలో (మేలో చేతికి వచ్చే) కలిపి ఇస్తారు. అప్పటి నుంచి 18 వాయిదాల్లో ఈ బకాయిల మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఉద్యోగి అకాల మరణం చెందితే మాత్రం వారి కుటుంబ సభ్యులు లేదా వారసులకు ఏకమొత్తంలో బకాయిలను చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సొసైటీలు తదితర సంస్థలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment