అంబర్‌పేట (హైదరాబాద్): ఫీజుల పేరిట కార్పొరేట్ కళాశాలలు సాగిస్తున్న దోపిడీకి అద్దం పట్టే ఘటన ఇది. ఓ కాలేజీ ధనదాహం ఏకంగా ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఇచ్చిన ఫీజు రాయితీ చెల్లదని, ఉత్తీర్ణత పత్రాలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలంటే బకాయి ఉన్న రూ.16 వేలు కట్టాల్సిందేనని ఓ విద్యార్థిపై ఇప్పటి ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారు. ఎంత వేడుకున్నా ఫలితంలేకపోవడంతో, ఈ మొత్తం చెల్లించే స్థితిలో లేని ఆ విద్యార్థి.. విద్యార్థి సంఘాల నేతలను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆ కళాశాలకు వెళ్లిన విద్యార్థి నేతల్లో ఒకరు.. ఎంత ప్రాధేయపడినా ప్రిన్సిపల్ విన్పించుకోక పోవడంతో, విధిలేని పరిస్థితుల్లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ అక్కడే వెలుగుతున్న దీపంపై కూడా పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ విద్యార్థి నేతతో పాటు మరో నాయకుడు, కాలేజీ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్‌పేట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లించాలంటూ...
మల్కాజిగిరి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన సాయి నారాయణ అంబర్‌పేట–రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ఇటీవల పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కళాశాలకు వెళ్లిన సాయి తనకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతకు సంబంధించిన పత్రాలు, టీసీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే తమకు చెల్లించాల్సిన ఫీజులో ఇంకా రూ.16 వేలు బకాయి ఉందంటూ చెబుతూ వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ తెగేసి చెప్పారు. అయితే గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ రాధాకృష్ణ తనకు రూ.16 వేలు రాయితీ ఇచ్చారంటూ చెప్పిన సాయి, ఆయన్ను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకోవాలని కోరాడు.
పదే పదే విజ్ఞప్తి చేసినా..
సాయి మాటలు పట్టించుకోని ప్రిన్సిపల్ సుధాకర్ గత ప్రిన్సిపల్ ఇచ్చిన రాయితీ ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. రూ.16 వేలు కూడా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానని తేల్చిచెప్పారు. అయినా సాయి దాదాపు 15 రోజులు కళాశాల చుట్టూ తిరుగుతూ, తన సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్, తదితరులను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో సాయి తనకు సాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘం నేతలు వెంకటచారి, సందీప్‌లను కోరాడు. వీరు శుక్రవారం మరికొందరు విద్యార్థులతో కలిసి నారాయణ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపల్‌ను కలిసి సాయి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పదేపదే కోరినా ఆయన విన్పించుకోలేదు. ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ పునరుద్ఘాటించారు. సాయిని కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేయడం, తాము వచ్చినా పట్టించుకోకపోవడంతో విద్యార్థి నేత సందీప్ ‘ఇస్తారా.. మమ్మల్ని ఇక్కడే చావమంటారా?’ అంటూ ప్రిన్సిపల్‌పై అసహనం వ్యక్తం చేశారు.
ససేమిరా అన్న ప్రిన్సిపల్, ఏఓ..
ఈ క్రమంలోనే కళాశాల కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ గదిలో ప్రిన్సిపల్ సుధాకర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) అశోక్‌రెడితో సందీప్ తదితరులు కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. ఎంత వాదించినా సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారుç ససేమిరా అన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సందీప్.. అప్పటికే తెప్పించి పెట్టుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకుని తనపై పోసుకున్నాడు. అలా పోసుకునే క్రమంలో పెట్రోల్ ఏఓ అశోక్‌రెడ్డి (45), మరో విద్యార్థి నేత వెంకటచారి పైనా పడింది. అలాగే ఆ పక్కనే ఉన్న దేవుడి చిత్రపటం ముందు వెలిగించిన దీపంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
సందీప్ సహా ముగ్గురికి తీవ్రగాయాలు...
మంటలు అంటుకున్న సందీప్, చారి, అశోక్ తీవ్రంగా గాయడపడ్డారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్‌కు సైతం మంటల ప్రభావానికి స్వల్పగాయాలయ్యాయి. ప్రిన్సిపల్ గదిలో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ఉద్యోగులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న చాదర్‌ఘాట్ అగ్నిమాపక శకటాలు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్‌కు 65 శాతం, అశోక్‌కు 50 శాతం, వెంకటచారికి 30 శాతం శరీరంపై కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు.
అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన
విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ కళాశాల ఫీజుల దోపిడీకి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఆశోక్‌రెడ్డి, ఇతర నాయకులు శ్రీకాంత్, దీప్‌కుమార్‌లు కళాశాల వద్ద ధర్నా చేశారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫీజు వేధింపులే ఘటనకు కారణం
నా కుమారుడు ఇదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారని తెలియడంతో కాలేజీకి వెళ్లాను. ఆ సమయంలోనే ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. ప్రిన్సిపల్ గది వైపు వెళ్లడంతో మంటలు అంటుకుని నేను కూడా స్వలంగా గాయపడ్డాను. ఫీజు కోసం వేధింపులకు గురిచేయడం వల్లే ఈ సంఘటన జరిగింది.
– ప్రత్యక్ష సాక్షి మహ్మద్ బూరాన్
–––––––––––––––––––––––––––
విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు: మంత్రి సబిత
అంబర్‌పేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు
Comments
Please login to add a commentAdd a comment