భారత రాష్ట్ర సమితి కార్యాయలంలో డబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణ కలకలం సృష్టించింది. ఇది ప్రీప్లాన్డ్ గా చేసిన ఆరోపణా? లేక నిజంగా జరిగిందా? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనికి సంబంధించిన వార్తను చదువుతుంటే అదేదో డిటెక్టివ్ కథ మాదిరిగా ఉంది. కథలో అన్నిసార్లు లింక్‌లు అవసరం లేదు. నిజాలతో సంబంధం ఉండనవసరం లేదు. కల్పితాన్ని ఎంత బాగా రాయగలిగితే అది అంతగా చదువరులకు నచ్చుతుంది.
ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఇలాంటి కథలు, కదనాలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి. ఏది నిజమో, ఏది కాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాకుండా, తాజాగా పంజాబ్‌లో పవర్‌ను సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇది నిజమే అయితే అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెప్పేవారిని కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి మాత్రమే నమ్మాలన్న అభిప్రాయం కలుగుతుంది. సుఖేష్ అన్న వ్యక్తి 200 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసిన కేసులో అరెస్టు అయ్యారు.
ఆయన గతంలో కేజ్రీవాల్‌తో సంబంధాలు నెరపారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ డిల్లీ ప్రభుత్వ పెద్దలను, అలాగే తెలంగాణలోని ప్రముఖులను ఇరకాటంలో పెడుతున్న తరుణంలో కొత్తగా ఈ బాంబు పడడం సంచలనమే అవుతుంది. అయితే ఇది రాజకీయ బాంబు అవుతుందా? లేక నిజంగా ఏదైనా ఆధారాలతో రుజువు అవుతుందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఇదంతా ఢిల్లీ రాజకీయ వివాదంగా కనిపిస్తున్న తరుణంలో , అందులో తెలంగాణ రాజకీయం కూడా ఉండడం చిత్రమైన పరిణామం. డిల్లీ లిక్కర్ కేసులో అక్కడి మంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు అరెస్టు అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత పలుమార్లు విచారణకు హాజరు కావల్సి వచ్చింది. ఆ కేసు లో తనను వేధిస్తున్నారని ఆమె సుప్రింకోర్టును ఆశ్రయించారు.
ఇదే కేసులు కొందరు పారిశ్రామికవేత్తలు కూడా చిక్కుకున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చి ప్రైవేటు వ్యాపారులకు లైసెన్స్‌లు ఇచ్చిన వ్యవహారం స్కామ్‌గా మారిందన్నది అభియోగం. ఇందులో ప్రత్యక్షంగా వంద కోట్లు చేతులు మారాయని అభియోగం. అది అలా ఉండగానే ఇప్పుడు ఈ డెబ్బైఐదు కోట్ల స్కామ్ ఆరోపణ తెరపైకి వచ్చింది. జైలులో ఉన్న ఒక నిందితుడు రాసిన లేఖలో ఈ విషయాలు ప్రస్తావించారు.
కేజ్రీవాల్‌తో అతను జరిపిన చాట్ 700 పేజీలు ఉందని చెబుతున్నారు. వాటిలో ఏముందో వచ్చే వారాలలో తెలుస్తుంది. కాని ఈ వార్తను చదువుతుంటే కొన్ని సంశయాలు వస్తాయి. అసలు సుఖేష్‌కు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. హైదరాబాద్‌లోనే సేకరించారా?. లేక ఎక్కడినుంచైనా వచ్చిందా? సుఖేష్ దీనిని తీసుకు వెళ్లి ‘ఏపీ’ అన్న వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? ‘ఏపీ’ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒక నిందితుడుగా ఉన్న అరుణ్ పిళ్లై కావచ్చా అంటూ కొన్ని మీడియాలు కథనాలు ఇచ్చాయి.
టీఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్ ఆఫీస్) ఆఫీస్‌లో ఎందుకు డబ్బు అందచేశారు. అసలు టీఆర్ఎస్‌కు ఈ డబ్బుతో అవసరం ఏముంది? ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సే 400 కోట్లపైబడి ఉన్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అలాంటప్పుడు నగదు 2020లో తీసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది. పంజాబ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఆప్‌కు సాయం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో కొందరు చేశారు. ఆ లావాదేవీకి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
మామూలుగా అయితే ఈ వార్తకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత రావాలి. కాని అంత విశేష ప్రాధాన్యత లభించినట్లు కనిపించదు. బహుశా ఇలాంటి సందేహాలు ఉండబట్టే మీడియా కూడా కాస్త జాగ్రత్తగా కవర్ చేసిందా? ఈనాడు వంటి మీడియా అయితే ఈ వార్త జోలికివెళ్లకపోవడం విశేషం. తెనాలిలో ఒక కౌన్సిలర్‌కు సంబంధించిన వార్తను సైతం తెలంగాణ ఎడిషన్‌లో ప్రచురించిన ఈనాడు ఇంత పెద్ద వార్త ఇవ్వలేదంటే ఇందులో మర్మమేమిటి? ఏపీలో ఉన్నవి, లేనివి నిత్యం అసత్యాలు వండి వార్చుతున్న ఈనాడు తెలంగాణలో మాత్రం అధికార పార్టీకి భయపడుతోందా? ఈ సంగతి ఎలా ఉన్నా ఈ కొత్త ఆరోపణను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. బిఆర్ఎస్ ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అని విమర్శించింది.
కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఖండనే ఇచ్చారు. సుఖేష్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారా? అన్న డౌటు రావడం సహజమే. ఇప్పటికైతే ఈ ఆరోపణ చూస్తే గాలిలో కత్తి తిప్పినట్లుగా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలు చూపనంతవరకు దీనికి అంత ప్రాధాన్యత రాదు. ఈ ఏడాది ఆఖరుకు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కథనాలు ప్రచారంలోకి వస్తే మాత్రం అది శోచనీయమే అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటివి విఘాతం కలిగిస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది పెద్దగా ఉపయోగపడకపోగా, రాజకీయంగా నష్టం కూడా కలుగుతుంది.
ఆధార సహితంగా ఈ అబియోగాలు వస్తే మాత్రం అక్కడ ఆమ్ ఆద్మిపార్టీకి, ఇక్కడ భారత రాష్ట్ర సమితికి ఇరకాట పరిస్థితే ఏర్పడుతుంది. మరో సంగతి ఏమిటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీక్ కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ వంద కోట్లకు పరువు నష్టం నోటీసు ఇవ్వడం సరైనదే అవుతుంది.
చదవండి: బీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్
ఆధారాలు లేకుండా ఎదుటివారిపై ఏది పడితే అది ఆరోపణ చేయడం వర్తమాన రాజకీయాలలో రివాజుగా మారింది. ఒక వేళ అధారాలు ఉంటే చూపవలసిన బాధ్యత సంజయ్, రేవంత్‌లపై ఉంటుంది. ఆధారాలు చూపితే కెటిఆర్ తన పదవిని వదలుకోవలసిన పరిస్థితి వస్తుంది. కేటీఆర్ సవాల్‌ను వీరు ఎంతవరకు అంగీకరిస్తారన్నది డౌటే. ఏది ఏమైనా ఇటీవలి పరిణామాలు బిఆర్ఎస్‌ను కాస్త చికాకుపెడుతున్నాయి. వచ్చే తొమ్మిది నెలల కాలంలో బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు సహజంగానే యత్నిస్తాయని చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment