ప్రతీకాత్మక చిత్రం
నేరడిగొండ(అదిలాబాద్): వేసవిలో ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. అనేక మంది దీనిని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తోంది. దీనికోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. వడదెబ్బకు సంబంధించి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ వడదెబ్బకు గురై చనిపోయిన వారి వివరాలు సేకరించి నివేదికను కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత రూ.50వేల పరిహారం మంజూరవుతుంది.
మండలానికో త్రిసభ్య కమిటీ
వడదెబ్బ మృతుల నిర్ధారణకు మండలానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, ఎస్సై, వైద్యాధికారి సభ్యులుగా ఉంటారు. ఎవరైనా వడదెబ్బతో మరణిస్తే ముందుగా కమిటీ సభ్యులకు సమాచారం అందించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందుగా వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీస్ స్టేషన్‌కు అందజేస్తే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ఈ నివేదికను తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టర్ పరిశీలించిన తర్వాత పరిహారాన్ని బాధిత కుటుంబానికి విడుదల చేస్తారు. వీటిపై ప్రజలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పోస్టుమార్టం తప్పనిసరి
వడదెబ్బతో మరణిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. కేసు లేకుండా, పోస్టుమార్టం లేకుండా ఎలాంటి పథకం వర్తించదు. ప్రాణాలు ఎంతో విలువైనవి. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– మహేందర్, ఎస్సై, నేరడిగొండ
కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం
వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే త్రిసభ్య కమిటీకి సమాచారం ఇవ్వాలి. డాక్టర్ వద్ద రిపోర్ట్ తీసుకుంటాం. కేసు వివరాలు ఎస్సై మాకిస్తే కలెక్టర్‌కు పంపిస్తాం. ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు జాగ్రత్తలుపాటించాలి.
– పవన్‌చంద్ర, తహసీల్దార్, నేరడిగొండ
సమాచారం అందించాలి
వడదెబ్బ తగులుతున్న వారిలో అధిక శాతం కూలి పనులకు వెళ్లేవారు, రైతులే ఉంటారు. పని సమయంలో గానీ పనులకు వెళ్లి వచ్చాక గానీ మరణిస్తే వెంటనే సమాచారం అందించాలి. డాక్టర్ నివేదిక తప్పనిసరిగా తీసుకోవాలి.
– ఆనంద్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యుడు, నేరడిగొండ
Comments
Please login to add a commentAdd a comment