సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్నాటక వరకు విదర్భ, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్రల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. అదే సమయంలో రాయలసీమలో గంటకు 30–40, కోస్తాంధ్రలో 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఇలావుండగా రాయలసీమలో రానున్న రెండు రోజులు వడగాడ్పులు కొనసాగనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గడచిన 24 గంటల్లో సీతానగరంలో 5, పార్వతీపురం, పాలకొండలలో 4, సీతారాంపురం, దువ్వూరు, వీరఘట్టంలలో 3, పాతపట్నం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కంబం, బలిజపేట, పులివెందుల, చాపాడుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.
పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరుల మృతి
పెద్దపంజాణి / గురజాల: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో బుధవారం పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. కోగిలేరు పంచాయతీ బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన అబ్బన్న కుటుంబ సభ్యులు గొర్రెలు మేపుకొంటూ జీవనం చేస్తున్నారు. రోజులాగే అబ్బన్న భార్య నాగమ్మ(68), మనవడు శశికుమార్(17)తో కలిసి గొర్రెలను సమీపంలోని పొలాలకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఇద్దరూ సమీపంలోని మామిడి చెట్ల కిందకు వెళ్లారు. సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పరిసర ప్రాంతంలోని రైతులు మృతదేహాలను చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. పెద్దపంజాణి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గుంటూరు జిల్లా గురజాల మండలంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. 31.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అదే సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment