హాజిపూర్‌లో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికం
నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం
అత్యవసరమైతే తప్ప మిట్టమధ్యాహ్నం బయటకు రావొద్దంటున్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా...
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment