
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ మరోసారి రసవత్తరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ విచారణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు(మంగళవారం) కవితను విచారిస్తామని గతంలో సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపించారు సీబీఐ అధికారులు.
ఈ క్రమంలో తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. మరోవైపు.. విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కోఠిలోని ఆఫీసుకు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతిలేదని ఇప్పటికే సర్కార్ జీవో 56 విడుదల చేసింది. ఈ తరుణంలో కవితను విచారించాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో, కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సీబీఐకి రాసిన లేఖలో కవిత.. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. సీబీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment