సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కోవిడ్–19 అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడం, ఉద్యోగావకాశాలు పెరిగిన నేపథ్యంలో కోవిడ్–19 కారణంగా భవిష్యనిధి నుంచి నగదు ఉపసంహరణ అవకాశాన్ని ఈపీఎఫ్‌ఓ రద్దు చేసింది. ఇకపై భవిష్యనిధి నుంచి సాధారణ కారణాలతో నగదు ఉపసంహరించుకునే అవకాశాన్ని మాత్రం కొనసాగిస్తోంది.
కోవిడ్–19 ప్రభావంతో 2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంలో పలుమార్లు వివిధ కంపెనీలు లాక్‌డౌన్ పాటించాల్సిరావడం, ఫలితంగా తయారీ రంగంతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈపీఎఫ్‌ఓ కోవిడ్–19 అడ్వాన్స్‌ల విడుదలకు నిర్ణయించింది.
ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించిన ఈ ఉపసంహరణ ప్రక్రియతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మంది ఖాతాదారులు రూ.50 కోట్ల మేర భవిష్య నిధిని ఉపసంహరించుకున్నారు.
నిధి మెరుగుపడేలా..
దాదాపు మూడున్నరేళ్ల పాటు కోవిడ్–19 ఆడ్వాన్స్ విడుదలకు ఈపీఎఫ్‌ఓ అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఖాతాదారులు దాదాపు మూడుసార్లు నిధి నుంచి అర్హత మేరకు ఉపసంహరించుకున్నారు. మూలవేతనం నుంచి దాదాపు 3 రెట్ల నగదును ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉండడంతో దాదాపు 2.25 కోట్ల మంది ఈమేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓలో చందాదారులుగా ఉన్నారు.
మారిన పరిస్థితుల దృష్ట్యా తాజాగా కోవిడ్–19 అడ్వాన్స్ ఉపసంహరణను ఈపీఎఫ్‌ఓ నిలిపివేసింది. భవిష్యత్ అవసరాల కోసం, పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చందాదారులు జీవించేందుకు వినియోగించుకోవాల్సిన ఈపీఎఫ్ నిధి నుంచి ఉపసంహరణ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే చివరి నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే ఉపసంహరణల ప్రక్రియకు కాస్త బ్రేక్ వేస్తూ సాధారణ పద్ధతిలో మాత్రమే నిధిని వెనక్కు తీసుకునే అవకాశాలను కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉపసంహరణలతో తగ్గిన నిధిని తిరిగి మెరుగుపర్చే దిశగా ఈపీఎఫ్‌ఓ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment