సాక్షి, హైదరాబాద్: బోయగూడలోని తుక్కు దుకాణం 11 మందిని పొట్టన పెట్టుకుంది. రూబీలాడ్జి ఎనిమిది మంది ఉసురు తీసింది. మినిస్టర్స్ రోడ్‌లోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఆరుగురు చనిపోయారు. ఇలా నగరంలో నిత్యం ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు కాలిబూడదవుతూనే ఉన్నారు.
సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు వెలుగు చూస్తుండటం..పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు, కూలీలు, ఈ అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని మృత్యువాతపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకెన్ని ఘటనలు వెలుగు చూడాలి? ఇంకెంత మంది బతుకులు కూలాలి? అంటూ సిటీజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపం వల్లే షార్ట్‌సర్క్యూట్‌లు
40 ఏళ్ల క్రితం 8 అంతస్తులతో స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ భవనంలో విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఏళ్ల క్రితం అమర్చిన విద్యుత్ లైన్లే ఇప్పటికీ వాడుతున్నారు. అప్పట్లో పెద్దగా విద్యుత్ వినియోగం ఉండేది కాదు. కేవలం లైట్లు, ఫ్యాన్ల వినియోగం సామర్థ్యం మేరకే కేబుళ్లు వేశారు. తర్వాత క్రమంగా విద్యుత్ వినియోగం రెట్టింపైంది. కానీ దీనికి తగ్గట్లుగా బిల్డింగ్ విద్యుత్ లైన్ల వ్యవస్థలో మార్పులు చేయలేదు.
మచ్చుకు కొన్ని ప్రమాదాలు
►ఉస్మాన్‌గంజ్‌లోని కార్తికేయ లాడ్జి గ్రౌండ్ ఫ్లోర్‌లో శాంతి ఫైర్స్ వర్క్స్ ఉండేది. అప్పట్లో అక్కడ పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ చేశారు. 2002లో అక్టోబర్ 23న తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అప్పటికే లాడ్జిలో 32 మంది నిద్రలో ఉండగా, వీరిలో 12 మంది అగ్నికీలల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డారు.
►సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో ఇటీవల అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్‌లో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి..పైన లాడ్జిలో ఉన్న 12 మంది మృతి చెందగా, మరో పదిమంది క్షతగాత్రులయ్యారు.
►2018లో ఎల్బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూల్లోని ఫొటో థెరపీ యూనిట్లపై చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులు కాలిబూడిదయ్యారు.
► 2022 మార్చి 23న న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. 11 మంది మృత్యువాతపడ్డారు.
► ఇటీవల డెక్కన్ మాల్‌లో వెలుగు చూసిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన తర్వాత అధికారులు ఆగమేఘాల మీద టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది.
►2017 ఫిబ్రవరి 24న అత్తాపూర్‌లోని ఫిల్లర్ నంబర్ 253 సమీపంలో ఉన్న కూలర్ల తయారీ పరిశ్రమలో అగి్నప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒరిస్సాకు చెందిన ఆరుగురు మృతి చెందారు.
► 2012 నవంబర్ 24న పుప్పాల్‌గూడలోని బాబానివాస్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు.
►2006 అక్టోబర్ 21న సోమాజిగూడలోని మీన జ్యూవెలర్స్ భవనం సెల్లార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ముగ్గురు చనిపోయారు.
►పురాతన సికింద్రాబాద్ క్లబ్ సహా అనురాధ టింబర్ డిపోల్లో వెలుగు చూసిన అగ్ని ప్రమాదాలకు కూడా ఈ షార్ట్‌షర్క్యూట్లే కారణమని తెలిసింది. అయితే ఆయా ఘటనల్లో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ.. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment