
బంజారాహిల్స్: సినీ పరిశ్రమ సమస్యలన్నీ ఒకటి, రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న సమావేశంతో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయని తెలిపారు. కూర్చొని చర్చించుకుంటే ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించారని, అయితే పన్నులు మాత్రం చెల్లించలేదన్నారు. ఇక ముందు అంతా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. టికెట్ల రేట్లు పెంచితే డబ్బులొస్తాయనడం భ్రమని, దానికి మద్దతివ్వకూడదని చెప్పారు.
అఖండ సినిమా పుష్పకంటే పెద్ద హిట్ అయినా.. పుష్ప సినిమానే ఎక్కువ కలెక్షన్‌లు వసూలు చేసిందని వెల్లడించారు. ఎక్కువ స్క్రీన్లు వేస్తే డబ్బులొస్తాయన్నారు. ఐదో షో వేసి చిన్న సినిమాలను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ అవార్డులు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న సినిమాలకు, ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేసుకున్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మినీ థియేటర్లను ప్రోత్సహించాలని, అవి వస్తేనే రెవెన్యూ పెరుగుతుందన్నారు. సినీ కార్మికులు ఈఎస్‌ఐ, పీఎఫ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ రెండూ చెల్లిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినందున మినిమం విద్యుత్ చార్జీలనే వసూలు చేయాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment