గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆదుకోలేదు..రాష్ట్ర పన్నుల్లో వాటా రాలేదు
రూ.30 వేల కోట్ల అప్పు చేస్తే.. రూ.10వేల కోట్లు వడ్డీ చెల్లింపులకే...
ఆగస్టు నాటికి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లెక్కలు వెల్లడించిన కాగ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్ర పన్ను ఆదాయం ఆపసో పాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5నెలల తర్వాత కూడా బడ్జెట్ అంచనాల్లో కేవలం 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.64 లక్షల కోట్లు పన్ను ఆదా యం కింద వస్తుందని రాష్ట్ర ప్రభు త్వం అంచనా వేయగా, ఆగస్టు 31 నాటికి కేవలం రూ.57వేల కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది ఐదు నెలల పన్ను ఆదాయంతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ కావడం గమనార్హం. ఇందులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకపు పన్ను ద్వారానే రూ.33,987 కోట్లు వచ్చాయి.
ఎక్సైజ్ ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం కలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పట్టిక ఇబ్బందులు పడుతోందని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన గణాంకాలు చెబుతు న్నాయి. పన్ను ఆదాయం రాని కారణంగా అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
తొలి అర్థ సంవత్సరంలో ఐదు నెలలు ముగిసేసరికి సుమారు రూ.30వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సేకరించగా, అందులో రూ.10వేల కోట్లకు పైనే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కట్టాల్సి వచ్చింది. ఇక, ఈ ఏడాది మూల ధనవ్యయం కింద రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఐదు నెలల్లో కేవలం రూ. 8,327కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం.
ఇక, ప్రధాన ఖర్చుల్లో రెవెన్యూ పద్దు కింద రూ.35వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, పింఛన్లకు రూ.7,165 కోట్లు, వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీల కింద రూ.5,396 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment