మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
నేడు సుందిళ్ల బ్యారేజీ సందర్శన
బ్యారేజీల్లో లోపాలపై అధ్యయనం
కాళేశ్వరం/ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనంలో భాగంగా పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు రాష్ట్రానికి చేరుకున్నారు. జేఎస్ ఎడ్లబడ్కార్ (జియో టెక్నికల్ పరీక్షల నిపుణుడు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్ పాలీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నిపుణుడు)తో కూడిన బృందం బుధవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజనీర్లతో కలసి ఈ బృందం పరీక్షలు నిర్వహించింది.
బృందం సభ్యులు ముందుగా మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైన కాలినడకన వెళ్లి పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్ 21న కుంగిన 7వ బ్లాక్‌లోని పియర్‌ను, అడుగు భాగం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. కుంగుబాటుకు గల కారణాలను సీఈని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు చేసిన పరీక్షల వివరాలను అడిగారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహ ప్రాంతాల్లో తిరిగారు. కుంగిన పియర్‌లు, క్రస్టుగేట్లు, అక్కడి పరిసరాలను ఫొటోలు తీసుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో 15 నుంచి 21వ పియర్ వరకు ఉన్న ఇసుక మేటలు, గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు.
గంటపాటు మేడిగడ్డను పరిశీలించిన అనంతరం అన్నారం బ్యారేజీకి వెళ్లారు. అక్కడ సీఈ, ఈఈ యాదగిరిలు వారికి బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీ బుంగలు, చేపట్టిన మరమ్మతుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్‌లో చేస్తున్న సీసీ బ్లాక్ పనులను చూశారు. ఎగువన ఇసుక మేటలను చూసి త్వరగా వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ బృందం గురువారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనుంది.
మూడు కేంద్ర సంస్థలతో పరీక్షలు..
కాగా, బృందం పర్యవేక్షణలో బ్యారేజీలకు జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో పాటు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ)తో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే శాశ్వత మరమ్మతులను నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది.
దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను ఇప్పటికే ప్రారంభించగా, త్వరలో ఎన్జీఆర్‌ఐ, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థల నుంచి సైతం శాస్త్రవేత్తలు పని ప్రారంభిస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో వేర్వేరుగా ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం అవి సమర్పించే నివేదికల ఆధారంగా మరమ్మతులు నిర్వహించాలని సోమవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment