ఆ రంగం ఈ రంగం అని లేదు.. ఇప్పుడు అన్ని రంగాల వారు కరోనాతో బాధపడుతున్నారు. ఐటీ రంగమూ ఇబ్బందిపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నారు. వారిలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నవాళ్లు, బ్యాచిలర్లు చాలా మంది ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇలాంటి వారికి తోడ్పాటు అందించేందుకు కొందరు కార్పొరేట్ ఉద్యోగులు తామే కుటుంబంగా మారారు. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా చేయూత అందిస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్
సెకండ్ వేవ్ వేళ.. కాలక్షేపపు, అపోహలు పెంచే వాట్సాప్ గ్రూప్‌లకు భిన్నంగా తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎమ్‌సీ) కరోనా హెల్ప్ డెస్క్ వాట్సాప్ గ్రూప్ పనిచేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నెల రోజుల కింద టీఎఫ్‌ఎమ్‌సీ ఏర్పాటైంది. ఆస్పత్రుల్లో బెడ్స్, ప్లాస్మా, కోవిడ్ పేషెంట్‌కి ఫోన్ కన్సల్టేషన్, రోగులు సమీపంలోని ఆస్పత్రులకు చేరేందుకు సహకరించడం, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ అందేలా తోడ్పడటం, అంబులెన్స్ సపోర్ట్.. వంటి సాయాన్ని ఆ గ్రూప్ ద్వారా అందిస్తున్నారు.
ఒత్తిడిలో ఉన్నారు
సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,500కి పైగా ఐటీ కార్యాలయాలకు చెందిన దాదాపు 6.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని టీఎఫ్‌ఎంసీ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు ఎం.సత్యనారాయ ణ చెప్పారు. ఐటీ పరిశ్రమలో పనిచేసే కొందరు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి మద్దతు అవసరమని గుర్తిం చి గ్రూప్‌ను నెలకొల్పామని తెలిపారు. ఈ వాట్సా ప్ గ్రూప్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సేవలు అందిస్తుందని చెప్పామ ని.. కానీ దాదాపు రోజు మొత్తం పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ గ్రూప్‌లో ప్రస్తుతం 200 మంది సభ్యులు ఉన్నారన్నారు.
నిజమైన సాయం కోసం
టీఎఫ్‌ఎమ్‌సీ కరోనా హెల్ప్ డెస్క్ ఒక వాట్సాప్ డెస్క్. దీనిని విభిన్న సంస్థలకు చెందిన మోహిని, షానోజ్, గిరీష్, సత్యనారాయణ, శ్రుతి, సంధ్య, స్వప్న, రమాకాంత్, శ్రీనివాస్ తదితరులు అడ్మిన్స్‌గా నిర్వహిస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో వివిధ అవసరాల కోసం సంప్రదించండి అంటూ షేర్ అవుతున్న నంబర్లలో 90 శాతం నకిలీవేనని వారు చెప్తున్నారు. తాము మాత్రం వీలైనంత వరకు సాయం అందించే ఉద్దేశంతో గ్రూప్ ఏర్పాటుచేశామని స్పష్టం చేస్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంత నివాసితులు, ఐటీ ఉద్యోగులకే ప్రధానంగా సేవలు అందిస్తున్నా.. మిగతా రంగాల వారికి కూడా వీలును బట్టి తప్పక సహకరిస్తామని అంటున్నారు. తమ హెల్ప్ డెస్క్ వాట్సాప్ నంబర్ 6309371600 ద్వారా అభ్యర్ధనలు తెలుపవచ్చన్నారు.
నిరుపేదల కోసం ఆక్సిజన్ హబ్
ఇంట్లో తగినన్ని సౌకర్యాలు సమకూర్చుకోలేని మైల్డ్ లక్షణాలున్న పేద కోవిడ్ రోగుల కోసం టీఎఫ్‌ఎమ్‌సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చందానగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఐసోలేషన్ కమ్ ఆక్సిజన్ హబ్‌ను ఈ గ్రూప్ నెలకొల్పుతోంది. దీనిని గురువారం ప్రారంభించనుంది. ఇందులో 14 రోజుల పాటు ఉచిత వసతి, అన్ని రకాల మందులు, ఆహారం, నర్సింగ్ కేర్‌తో పాటు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, ఆక్సిమీటర్స్ తదితర సదుపాయాలు సిద్ధంగా ఉంచుతున్నారు. ఏకకాలంలో 30 మందికి చోటు కల్పించవచ్చు. జీహెచ్‌ఎమ్‌సీ, ఐకియా, హార్స్‌కో, గ్రామెనెర్, జెనోటీల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ఈ హబ్‌లో ఉండగా అత్యవసర పరిస్థితి వస్తే తరలించడానికి అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.
బెడ్స్ కోసమే ఎక్కువ
మాకు గత 10 రోజుల్లో 637 అభ్యర్థనలు వచ్చాయి. 600 అభ్యర్ధనలను మేం ఫుల్‌ఫిల్ చేశాం. ఇందులో 230 వరకూ అన్ని వసతులూ ఉన్న బెడ్స్ కోసం కాగా.. బ్లడ్, ప్లాస్మా కోసం 80, డాక్టర్ కన్సల్టేషన్ కోసం 25, ఆక్సిజన్ సప్లై కోసం 82 అభ్యర్థనలు వచ్చాయి. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వైజాగ్, విజయవాడ, నెల్లూర్, వరంగల్, తిరుపతి నగరాల నుంచి కూడా 130 మంది కాల్స్ చేశారు. అంబులెన్స్ గురించి కూడా పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి
– మోహిని చైతన్య, టీఎఫ్‌ఎంసీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment